మత్తుపదార్ధాల మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

– రూ.1.5 కోట్ల విలువైన హ‌షీష్ ఆయిల్ సీజ్‌
– మ‌ల్కాజ్‌గిరి పోలీస్ క‌మిష‌న‌ర్ సుమితి
హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 17: అంతర్రాష్ట్ర హషీష్ ఆయిల్ సరఫరా ముఠా గుట్టు రట్టు చేసిన‌ట్టు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి వెల్ల‌డించారు. సోమ‌వారం ఎల్‌బీనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రూ.1.50 కోట్ల విలువైన 12 కిలోల హషీష్ ఆయిల్ పట్టివేసామ‌ని, దీన్ని రవాణా చేస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని వివ‌రించారు. ఎస్ఓటీ ఎల్‌బీనగర్–వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించార‌ని తెలిపారు.  చింతల్‌కుంట–వనస్థలిపురం వద్ద పక్కా సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేసిఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు హషీష్ ఆయిల్ తరలిస్తుండగా ప‌ట్టుకున్నామ‌న్నారు. కాళ్లు, పొట్టకు హషీష్ ఆయిల్ ప్యాకెట్లు కట్టుకుని వినూత్న ప‌ద్ధ‌తిలో,  ఒక్కొక్కరు 3 కిలోల చొప్పున తరలిస్తుండగా పోలీసులు ప‌ట్టుకున్నార‌న్నారు. 12 కిలోల హషీష్ ఆయిల్‌తో పాటు 5 మొబైల్ ఫోన్లు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. నిరుద్యోగ గిరిజన యువతకు డబ్బు ఆశ చూపి క్యారియర్లుగా వినియోగించినట్లు గుర్తించామ‌న్నారు. 12 కిలోల హషీష్ ఆయిల్ బెంగళూరుకు చేర్చేందుకు రూ.10 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నార‌న్నారు. ప్రధాన సరఫరాదారు కృష్ణ కాగా, బెంగళూరు రిసీవర్ సిజో కోసం పోలీసులు గాలింపు జ‌రుపుతున్నారు. మత్తు మాఫియా మూలాల వరకు వెళ్లి మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదిస్తామ‌ని సీపీ బి. సుమతి స్ప‌ష్టం చేసారు. డ్రగ్స్ దందాతో యువత జీవితాలను నాశనం చేస్తే సహించేది లేద‌న్నారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా పోలీసుల నిఘా నుంచి తప్పించుకోలేరు. ఎక్కడ ఉన్నా గుర్తిస్తాం.. ఎంత దూరంలో ఉన్నా వెంటాడుతాం. మత్తు వ్యాపారుల విషయంలో రాజీ అనే మాటకు తావులేదు. మత్తు మాఫియా ఎంతటి బలమైనదైనా చట్టం కంటే బలమైంది కాదు. మత్తు రహిత సమాజమే మల్కాజిగిరి పోలీసుల లక్ష్యమ‌న్నారు. డ్రగ్స్‌పై సమాచారం ఉంటే పోలీసులకు అందించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.
————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *