హర్యానా హస్తగతమే…! పీపుల్స్ ప‌ల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాల వెల్ల‌డి

ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. పీపుల్స్‌పల్స్‌ సంస్థ నిర్వహించిన సర్వే ( Haryana Exit Poll 2024 )  ప్రకారం కాంగ్రెస్- 55 , బీజేపీ- 26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాలి. అయితే కాంగ్రెస్‌ పార్టీ, తన ప్రత్యర్థి బిజెపిపై 7-8 శాతం వోట్ల ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉంద‌ని పీపుల్స్ పల్స్ స‌ర్వే పేర్కొంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్ఎల్డి-బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1 శాతం, జేజేపీ ఒక్క శాతం లోపు, ఇతరులకు 10 శాతం వోట్లు వొచ్చే అవకాశం ఉంద‌ని పేర్కొంది.

సీఎల్పీ నేత భూపీందర్ సింగ్ హూడాకు 39 శాతం, సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనీకి 28 శాతం, కాంగ్రెస్ ఎంపీ కుమారీ సెల్జాకు 10 శాతం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు 6 శాతం మంది ఈ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావాలని మద్దతిస్తున్నార‌ని పీపుల్స్ పల్స్ నివేదిక వెల్ల‌డించింది. కాగా * హర్యానాలో ప్రధాన పోటీ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. ప్రాంతీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జననాయక్ జనతా పార్టీలు బలహీనపడ్డాయి. ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలు కీలకపాత్ర పోషించాయి. స్థానిక ఎమ్మెల్యే పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల ఆధారంగా ప్రజలు వోటు వేశారు ఓటర్లు జాతీయ అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రధాని మోదీ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించలేదని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ స‌ర్వేలో వెల్ల‌డ‌య్యాయి. నిరుద్యోగం, అగ్నీవీర్ పథకం, రైతు సమస్యలు, ధరల పెరుగుదల వంటి అంశాలు ప్ర‌భావితం చేశాయి. పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు తోడుగా రాష్ట్రంలో రైతులు, రెజ్లర్లు, యువత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *