ఆలయాల్లో చేనేత శాలువాలే అందించాలి

– మంత్రి సురేఖకు పద్మశ్రీ అవార్డు గ్రహీత అంజయ్య వినతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 : రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత రంగంలో తయారు చేసిన శాలువాలను మాత్రమే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాU మంత్రి కొండా సురేఖను కోరారు. జూబ్లిహిల్స్‌లోని ఆమె నివాసంలో మంగళవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం అనేక దేవాలయాల్లో కృత్రిమ నూలుతో మరమగ్గాలు, మిల్లుల్లో తయారైన శాలువాలు వినియోగిస్తున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. ఆలయాల్లో చేనేత వస్త్రాల వినియోగంపై ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. చేనేత రంగ పురోగతికి, చేనేత కార్మికుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చేనేతకారులు స్వచ్ఛమైన నూలుతో తయారైన శాలువాతో మంత్రిని సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఆలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధిస్తున్న పరిస్థితుల్లో సింథటిక్ నూలుతో తయారైన శాలువాల వినియోగాన్ని కొనసాగించడం సముచితం కాదని మంత్రి సురేఖకు తన అభిప్రాయాన్ని తెలిపారు. పవిత్రమైన ఆలయాల్లో భక్తులకు అందించే శాలువాలు స్వచ్ఛమైన పత్తి లేదా పట్టు, చేనేత వస్త్రాలతో తయారైతే వాటికి మరింత ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువ చేకూరుతుందని అంజయ్య తెలిపారు. అదే సమయంలో ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాదిమంది చేనేత కార్మికులకు స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు తెలంగాణ చేనేత సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడుతుందని వివరించారు. గజం అంజయ్య సూచనలు, ప్రతిపాదనలను మంత్రి సురేఖ సానుకూలంగా స్వీకరించారు. ఈ దిశగా కృషి చేస్తున్న ఆయనను అభినందించారు. పర్యావరణ పరిరక్షణతోపాటు భారతీయ సంప్రదాయాల సంరక్షణలో చేనేత కార్మికులు పోషిస్తున్న పాత్ర అమూల్యమైనదని ఆమె కొనియాడారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాధ్యాసాధ్యాలను పరిశీలించి చేనేత రంగానికి మద్దతుగా తగిన చర్యలు చేపడతామని అంజయ్యకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చేనేత రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *