– బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 :: ఈనెల 16న జరగనున్న మొహర్రం ఉరేగింపు కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం ఏర్పాట్లపై సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మొహర్రం కార్యక్రమాలు నిర్వహించే ఆశుర్ ఖానాల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. వాటి పరిసర ప్రాంతాలలో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, రోడ్లు మరమ్మతు పనులను వెంటనే పూర్తిచేయాలని, అన్నిచోట్ల హైమాస్ట్ లైట్లను ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలని, వాటర్ బోర్డు అధికారులు తాగు నీటి సరఫరా చేయాలని, జీహెచఎంసీ అధికారులు పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని కూడా ఆదేశించారు. మొబైల్ టాయిలెట్స్ తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్ అండ్ బి అధికారులు బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రధాన ఊరేగింపు ప్రారంభం కానున్న బీబీ-కా-ఆలం పరిసరాల ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆశుర్ ఖానాలకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచించారు. వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీ, చార్మినార్, బహదూర్‌పురా, యాకత్‌పురా, నాంపల్లి, కార్వాన్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు, మీర్ జుల్ఫెకర్ అలీ, మహమ్మద్ ముబీన్, జాఫర్ హుస్సేన్, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొహియుద్దీన్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, మీర్జా రహ్మత్ బేగ్, వక్ఫ్ బోర్డు చైర్మన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబైదుల్లా కొత్వాల్, మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా, వక్ఫ్ బోర్డు సీఈవో తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




