అనాలోచిత నిర్ణయాలతో సంక్షోభంలో రైతులు

– ఐదు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా
– రైతులకు బీమా రక్షణ లేకుండా చేశారు
– ఎల్ నినోపై కేంద్ర సహాయం కోరాలి
– వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ నీటి అక్రమ తరలింపు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద‌ర్‌రావు

నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30:  కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ముందస్తు ప్రణాళిక లేమి, నిర్లక్ష్య వైఖరి కారణంగానే నేడు వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నల్గొండ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎండిన పంట పొలాలను, బోర్లపై ఆధారపడి సాగుచేస్తున్న రైతుల దుస్థితిని స్వయంగా పరిశీలించిన అనంతరం నాగార్జునసాగర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 నుంచి 15 గంటల విద్యుత్ ఇస్తున్నామని ప్ర‌భుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుతున్నది గరిష్టంగా ఐదు గంటలు మాత్రమేనని రైతులు వాపోతున్నారని తెలిపారు. అది కూడా తీవ్రమైన ట్రిప్పింగ్‌లు, బ్రేక్‌డౌన్లతో సరఫరా అవుతుండటంతో భూగర్భ జలాలు తోడలేక కళ్లముందే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ లేక ఒకవైపు పొలాలు ఎండుతుంటే మరోవైపు గ్రామాల్లో ప్రజలు, చిన్నారులు ఫ్యాన్లు తిరగక తీవ్ర ఉక్కపోత, దోమలతో నరకయాతన అనుభవిస్తున్నారని ఫైరయ్యారు. వరంగల్ ‘రైతు డిక్లరేషన్’ సభలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కంటే మెరుగైన బీమా పథకాన్ని తెస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక రైతులకు కనీస బీమా రక్షణ లేకుండా మోసం చేశారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి ప్రీమియం చెల్లించకుండా ఫసల్ బీమాను పక్కనబెట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తూ రైతుల నోట్లో మట్టి కొడుతోందన్నారు. ఎల్-నినో ప్రభావం వల్ల వర్షాభావం, ప్రకృతి వైపరీత్యంపై ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని, కర్ణాటక ప్రభుత్వం తరహాలోనే కేంద్ర ప్రభుత్వ సహాయం కోరి కేంద్ర బృందాన్ని రప్పించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయించాలని, రైతులకు తక్షణ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరవాసుల తాగునీటి అవసరాలు నాగార్జునసాగర్ నుంచి ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 ద్వారా తీరుతున్నాయని, నగరంలోనూ, పట్టణాల్లోనూ తీవ్ర తాగునీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటిని వెంటనే కిందికి విడుదల చేయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల కేటాయింపుల్లో 811 టీఎంసీలలో తెలంగాణ ప్రవాహ ప్రాంతం ఎక్కువగా ఉండి కనీసం 500 టీఎంసీలు రావాల్సి ఉండగా గత కేసీఆర్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలకే సంతకం పెట్టి తీరని ద్రోహం చేసిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం ఫ్లడ్ వాటర్‌తో పాటు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలను తరలించుకుపోతున్న వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని, తెలంగాణ నికర జలాల పరిరక్షణ కోసం బీజేపీ రాజీ లేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
ఇటీవల క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు, రైతుల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు తాను స్వయంగా జూరాల ప్రాజెక్టు వద్దకు వెళితే పోలీసులు అడ్డుకున్నారని రామచందర్ రావు మండిపడ్డారు. రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో అధికారులు అదే రోజు సాయంత్రం కొంత నీటిని విడుదల చేయడంతో ఆ పరివాహక ప్రాంత రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. కేవలం రూ.900 కోట్లతో నెట్టెంపాడు, డిండి, కల్వకుర్తి తదితర చిన్న ప్రాజెక్టుల మరమ్మతులు, డీసిల్టింగ్ పనులు పూర్తి చేసి ఉంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇంతటి నీటి కొరత ఉండేది కాదన్నారు. తుంగభద్ర పరిధిలోని ఆర్డీఎస్ (రాజోలిబండ)లో 15 టీఎంసీల సామర్థ్యం ఉంటే పూడికతీయక కేవలం 5 టీఎంసీలకే పరిమితమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో సరైన డిజైనింగ్ లేకపోవడం, నాణ్యతా లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనల ప్రకారం ఆ మూడు బ్యారేజీలకు ఏ విధంగా మరమ్మతులు చేపట్టాలి, వాటిని తిరిగి ఎలా వినియోగంలోకి తీసుకురావాలనే విషయాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలన్నారు. అదేవిధంగా విద్యుత్ కొరతకు బొగ్గు కొరతే కారణమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నెపం మోపే ప్రయత్నం చేయడం హాస్యాస్పదమని రామచందర్ కొట్టిపారేశారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ యాజమాన్యం, పరిపాలనా నియంత్రణ, బదిలీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి ఎలాంటి వేలం లేకుండానే తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ను కేటాయించి రూ.వందల కోట్ల  ఆర్థిక వెసులుబాటు కల్పించిందని గుర్తు చేశారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను కేంద్రం ఎప్పటికప్పుడు చెల్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమే వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. థర్మల్ విద్యుత్‌తోపాటు జెన్‌కో, డిస్కమ్‌ల సమన్వయం, హైడల్, సోలార్ ప్రాజెక్టులు, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో విఫలమై బొగ్గు కొరత నెపం మోపి తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చిన్న మాదారం గ్రామంలో పర్యటించి నీరందక నిలువునా ఎండిపోయిన పొలాలను పరిశీలించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *