– మహిళలరు మంత్రి సీతక్క సూచన
– మహిళా సంఘాలకు రూ.75 వేల కోట్ల బ్యాంకు రుణాలు
– బ్యాంకర్లకు సన్మానం
– సరస్ మేలాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14: గ్రామీణ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మహిళలు చేయి చాచి అడిగే స్థాయి నుంచి పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా స్వయం సహాయక సంఘాలపై నమ్మకంతో పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్న బ్యాంకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి సొమ్ము సంపాదిస్తే ఎంతో తృప్తి ఉంటుందని, మహిళలు సంపాదించే ప్రతి రూపాయి వారి శ్రమకు, కష్టానికి ప్రతిఫలమని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచఎండీఏ గ్రౌండ్లో నిర్వహిస్తున్న సారస్ మేలా -2026లో మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడంలో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్ల సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లను సన్మానించారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించి, తమ అవసరాలను తామే తీర్చుకునేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకు రూ.75 వేల కోట్ల రుణాలు అందించామని వెల్లడించారు. గతంలో రూ.5 లక్షలుగా ఉన్న రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. మహిళల పొదుపును ఆర్థిక బలంగా మార్చి, ప్రతి మహిళను విజయవంతమైన వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని కొందరు ఎగతాళి చేస్తున్నారని, అలాంటి విమర్శలను పట్టించుకోకుండా మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సీతక్క పిలుపునిచ్చారు. విమానాలు నడపగలిగిన మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరన్నారు. మహిళలు వ్యాపారాలు, పరిశ్రమలు సహా అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ బాధ్యతను గుర్తించి రుణాలను తిరిగి చెల్లిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మహిళల నిజాయతీ, క్రమశిక్షణ, ఆర్థిక బాధ్యతకు ఇది నిదర్శనమన్నారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే ఇల్లు సంతోషంగా ఉంటుందని తెలిపారు. కష్టపడి వ్యాపారాలు నిర్వహిస్తూ విజయాలు సాధిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలకు అభినందనలు తెలిపారు. గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధికి సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పిస్తున్న సరస్ మేళా వంటి కార్యక్రమాలు మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు సారస్ మేలాను సందర్శించి మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వారి వ్యాపారాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
మేలా ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు 
బ్యాంకర్ల సన్మాన కార్యక్రమం అనంతరం సరస్ మేలా ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్తోపాటు ఇందిరమ్మ చీరలు ధరించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఏర్పాటు చేసి సంప్రదాయ పాటలు పాడారు. మహిళల ఆటపాటలతో మేలా ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలంతా ఐక్యంగా, ఉత్సాహంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాగా, సారస్ మేలాలో స్టాళ్ల సందర్శన సందర్భంగా షాపు నిర్వాహకులు మంత్రి సీతక్కకు సంప్రదాయ గిరిజన ఆభరణాలను ధరింపచేశారు. అలాగే అక్కడ ఓ స్టాల్లో వస్త్రంపై వేసిన సీఎం రేవంత్ రెడ్డి పెయింటింగ్ను ఆమె ఆసక్తిగా తిలకించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





