(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేసే విషయంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో వ్యూహాత్మక సందిగ్ధం నెలకొంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలా లేక మరోపార్టీతో కలిసి రంగంలోకి దిగాలా అన్న విషయంలో ఈ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలో వచ్చేసంవత్సరం మార్చ్‌లో రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అందులో ఒకటి హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ కాగా, మరొకటి వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎంఎల్సీ స్థానాలకు జరుగనున్న ఎన్నికలను రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే శాసనసభ ఎన్నికలపై ప్రభావాన్ని చూపుతాయన్న అభిప్రాయం అన్నిపార్టీల్లో ఏర్పడడంతో ఈ రెండుస్థానాలను కైవసం చేసుకునేందుకు ఆయాపార్టీలు తీవ్ర ప్రయత్నాలను ప్రారంభించాయి. ఈ ఎన్నికలు ఒకవిధంగా ఆయాపార్టీలకు లిట్మస్ టెస్ట్లాంటివన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ ఎన్నికల అభ్యర్ధులను ఇప్పటికే అధికార కాంగ్రెస్‌పార్టీ ప్రకటించింది. బిఆర్ఎస్, బిజెపిలు ఇంకా అభ్యర్థులను ఎంపికచేసే కార్యక్రమంలో ఉన్నాయి. దాదాపు రాష్ట్రంలోని సగం జిల్లాలు ఈ రెండు ఎంఎల్సీ స్థానాల పరిధిలో ఉండడంతో ప్రజలతో సత్సంబందాలు కలిగిన వ్యక్తిని బరిలో దింపాలని ఆ పార్టీలు ఆలోచిస్తున్నాయి. కాగా సిపిఎం, సిపిఐలు ఈ ఎన్నికల్లో నేరుగా పోటీపడాలా లేక మరేపార్టీతోనైనా కలిసి పోటీ చేయాలా అన్నవిషయాన్ని ఇంకా తేల్చుకోలేకపోతున్నాయి. సిపిఐ ఇప్పటికే కాంగ్రెస్‌తో కలిసిఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీతో సంబంధం లేకుండానే కాంగ్రెస్‌పార్టీ ఈ రెండు ఎంఎల్సీ స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. హైదారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంఎల్సీ నియోజకవర్గానికి సామా రామ్మోహన్‌రెడ్డిని, వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఎంఎల్సీ నియోజకవర్గానికి రాంరెడ్డి సర్వోత్తమరెడ్డిని కాంగ్రెస్ పోటీకి దించింది. అయితే మిత్రపక్షంగాఉన్న తమకు ఏమాత్రం తెలుపకుండా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంపట్ల సిపిఐ గుర్రుగాఉంది. ఈ నియోజకవర్గాల పరిధిలో తమకు అంతోఇంతో బలంఉన్నా కాంగ్రెస్ తమను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆపార్టీ తీవ్ర అసంతృప్తితో ఉంది. కాగా సిపిఎం మాత్రం తాము రెండు స్థానాలకు పోటీచేస్తామంటోంది. అయితే సోదరపార్టీ అయిన సిపిఐని కలుపుకుని వెళ్ళాలా లేక స్వతంత్రంగా బరిలో దిగాలా అన్న ఆలోచనలో ఆపార్టీఉంది. ఈ రెండుపార్టీలు కలిసి లేదా ఒంటరిగా పోటీచేస్తే, కాంగ్రెస్ వ్యతిరేక వోట్లు బిజెపి, బిఆర్ఎస్లనుకాదని తమకే పడుతాయన్న నమ్మకంఉందా అన్న ప్రశ్నకూడా ఉత్పన్నమవుతున్నది. అందుకు గతంలో మాదిరిగా కాంగ్రెస్‌కు మద్దతివ్వడంద్వారా వోట్లు చీలకుండా చూడవచ్చని ఆపార్టీలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి కమ్యూనిస్టుపార్టీల ఐక్యతకోసం ఈ రెండుపార్టీల నాయకత్వాలు ఇప్పటికే సమావేశమైనప్పటికీ ఇంకా తుదినిర్ణయానికి రాలేకపోయాయి. ఇంకా ఆ విషయం పెండింగ్‌లోనే ఉంది. అయినప్పటికీ గ్రాడ్యుయేట్ వోటర్లను చేర్పించడంలో ఈపార్టీలు తమతమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇదిలాఉంటే బిఆర్ఎస్ ఎత్తుగడతో రాష్ట్ర రాజకీయాలు కొత్తమలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీల సందిగ్ధతకు బిఆర్ఎస్ బ్రేక్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తమతో కలిసి పనిచేయాల్సిందిగా ఆపార్టీలకు బిఆర్ఎస్ ఆహ్వానం పలుకుతున్నట్లు తెలుస్తున్నది. దానిపై తమ అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిపిఎం రాష్ట్రనాయకత్వం బిఆర్ఎస్కు ఇప్పటికే తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ విషయంలో సిపిఐ నుండి స్పందన కనిపించడంలేదు. గత శాసనసభ ఎన్నికల్లో సిపిఐపార్టీ బిఆర్ఎస్తో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. 2023 ఎన్నికల తర్వాత సిపిఐ కాంగ్రెస్ పంచనచేరి రాజకీయ లబ్ధిపొందింది. అయినప్పటికీ మున్సిపల్, సింగరేణి కార్మికుల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రమేయంలేకుండా ఒంటరిగానే పోటీచేసి మెజార్టీని నిరూపించుకుంది. తాజాగా జరిగిన ఆర్టీసి కార్మికుల గుర్తింపు ఎన్నికల్లో కూడా ఆపార్టీ అనుబంధసంస్థ ఎంప్లాయిస్ యూనియన్ (ఇయు) కూటమి విజయం సాధించిన విషయం తెలియందికాదు. కాంగ్రెస్ మద్దతిచ్చిన తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టిడబ్ల్యుయు)పై ఇయు పైచెయ్యి సాధించడంతో ఇప్పుడు ఆ పార్టీకి పట్టపగ్గాలు లేకుండాపోయింది. దీంతో ఎంఎల్సీ ఎన్నికల్లో తమపార్టీ పోటీచేసే విషయంలో ఆలోచనలో పడింది. కాగా ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులను ప్రకటించినప్పటికీ ఆ పార్టీలోనే విమర్శలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో కొంతకాలంగా బిసీ ఉద్యమం కొనసాగుతున్న నేపధ్యంలో అభ్యర్థులిద్దరిని రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారిని ఎంపిక చేయడంపట్ల పార్టీలోని బిసీ వర్గాలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో ఇద్దరిలో ఒకరినిమార్చి బిసీ వర్గానికి చెందిన వ్యక్తిని అభ్యర్ధిగా ప్రకటించవచ్చనుకుంటున్నారు. బిజెపి విషయానికొస్తే అనేక మంది అభ్యర్దిత్వంకోసం పోటీ పడుతున్నప్పటికీ గట్టిపోటీ ఇచ్చేవారికోసం అధిష్టానం ఎదురుచూస్తున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీగా గతంలో ఎన్నికైన రాంచందర్‌రావునే పోటీకి నిలుపాలని అధిష్టానం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాంచందర్‌రావు మాత్రం పోటీకి విముకత వ్యక్తంచేసినట్లు తెలుస్తున్నది. ఏదిఏమైనా అభ్యర్థుల ఎంపికకోసం నియమించిన రెండు కమిటీలు రెండు ఎంఎల్సీ స్థానాల్లో పోటీచేసే ఆశావహుల జాబితాను సిద్దంచేసి అధిష్టానానికి పంపినట్లు తెలుస్తున్నది. వరంగల్,ఖమ్మం,నల్లగొండ నియోజవర్గానికి సంబందించి రాణి రుద్రమ, ప్రేమేందర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నా, బిసి వర్గానికి ప్రాధాన్యం ఇచ్చేక్రమంలో బూరా నర్సయ్యగౌడ్‌కు అవకాశంరావచ్చనుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌కూడా తన అభ్యర్థులను ఇంకా ప్రకటించక పోయినప్పటికీ గతంలో ఆపార్టీ పక్షాన ఎంఎల్సీగా పోటీచేసి ఓటమి చవిచూసిన రాకేశ్‌రెడ్డికే మరోసారి అవకాశం లభించవచ్చనుకుంటున్నారు. అలాగే ఆ పార్టీనుండి హైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





