9లోగా రూ.లక్ష కట్టకపోతే ఇందిరమ్మ ఇల్లు రద్దు

– లబ్ధిదారులకు ప్రభుత్వం తుది హెచ్చరిక

హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : హైదరాబాద్ నగరంలో క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల టవర్ల లబ్ధిదారులకు హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. లబ్దిదారులు తమ వాటాగా చెల్లించాల్సిన రూ.లక్ష మొత్తానికి ఈనెల 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువులోగా డబ్బు చెల్లించని వారి ప్రొవిజినల్ అలాట్‌మెంట్ లెటర్లను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే రద్దు చేస్తామని స్పష్టం చేసింది. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వి.పి.గౌతమ్ ఈ వివరాలు వెల్లడించారు. క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 5,501 మందికి ప్రొవిజినల్ అలాట్‌మెంట్ లెటర్లు జారీ చేయగా, ఇప్పటివరకు 3,271 మంది (దాదాపు 59.46 శాతం) మాత్రమే తమ చెల్లింపులు పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన లబ్ధిదారులు కూడా వెంటనే స్పందించి, గడువులోగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు పూర్తి చేయాలని ఆయన కోరారు. అక్టోబరు 9 తర్వాత గడువును పొడిగించే ప్రసక్తే లేదని కమిషనర్ గౌతమ్ తేల్చిచెప్పారు. గడువులోగా చెల్లించడంలో విఫలమైన వారి కేటాయింపులను రద్దు చేసి ఆ ఖాళీలను వెయిటింగ్ లిస్టులో ఉన్న సుమారు 35 వేల మంది అర్హులైన దరఖాస్తుదారులకు కేటాయిస్తామన్నారు. రాబోయే నెలల్లో లాటరీ పద్ధతిలో ఈ కేటాయింపులు ఉంటాయని ఆయన వివరించారు. అయితే ప్రభుత్వం ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించాలని చెబుతుండటంతో ఆ పద్ధతి తెలియని పలువురు లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. పథకం, కేటాయింపు, చెల్లింపులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా హౌసింగ్ బోర్డు కాల్ సెంటర్ 040-24603572లో సంప్రదించాలని అధికారులు సూచించారు. కేటాయింపుదారులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు వాట్సాప్ ద్వారా కూడా సమాచారం పంపుతున్నట్లు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *