ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపని ప్రభుత్వాలు

– కనీస వసతులు లేని ప్రభుత్వ హాస్పిటల్స్
– అందువల్లనే వీటికి ప్రజలు దూరమవుతున్నారు
– సదుపాయాలు సక్రమంగా వుంటే వ్యవస్థమీద నమ్మకం పోదు
– నిపుణులైన డాక్టర్లున్నారు. .కానీ సదుపాయాలు లేవు
– ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రికి మేధావుల లేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలకి పెద్దగా శ్రద్ధ వుండదని మళ్లీమళ్లీ ఎదురవుతున్న ప్రత్యక్ష అనుభవమన్నది అక్షరసత్యం. రాష్ట్ర రాజధానిలో ముఖ్యమైన ప్రభుత్వ హాస్పిటల్స్ పరిస్థితి ఏమిటి అని మళ్లీ ఒకసారి గుర్తు చేయాల్సివచ్చినందుకు బాధగా వున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు రాసిన లేఖలో మేధావులు, సామాజిక కార్యకర్తలు, పౌరసంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ లేఖపై మొత్తం 115 మంది సంతకాలు చేశారు. రాష్ట్ర రాజధాని విషయంలోనే ఇలాంటి ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే ఇక జిల్లా కేంద్రాలలో, మండలస్థాయి హాస్పిటల్స్ పరిస్థితి ఎట్లా వుంటుందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు.  ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, పెట్లబుర్జ్ ప్రసూతి హాస్పిటల్స్  వంటి రెఫరల్ హాస్పిటల్స్ కు మీరెప్పుడైనా మీకు ఏదైనా ఆరోగ్య అవసరం రీత్యా లేదా మీకు కావలసిన వాళ్ల కోసం వెళ్లారా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ప్రభుత్వ హాస్పిటల్స్ కు ప్రజలు దూరమవుతున్నారన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రాథమిక సదుపాయాలు సరిగ్గా వుంటే ప్రజలకు ఈ వ్యవస్థమీద నమ్మకం పోయేదా? అని ప్రశ్నించారు. అక్కడ కనీస ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకపోబట్టేకదా ప్రజలు ప్రైవేటు హాస్పిటల్స్ వైపు మళ్లాల్సి వస్తున్నదన్నారు. ఇక్కడ లేని నైపుణ్యం ఏదో కార్పొరేట్ హాస్పిటల్ లోనూ,ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ దొరుకుతుందని మాత్రం కాదు. నిజానికి పరిశోధన, అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు,ఇతర సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందుబాటులో వుంటున్నారు. కానీ, నిలబడటానికి కూడా వీల్లేని దుర్భర పరిస్థితులు వుండబట్టే కదా అక్కడి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారని గుర్తుచేశారు.  ఆ ఇబ్బందికర పరిస్థితులను భరిస్తూ సామాన్య ప్రజలు లక్షలాదిగా ఇంకా అక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు అంటే అది అక్కడ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బంది నిబద్దత వల్లనే. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే గోడల మీద, అంబులెన్స్ ల మీద ఫోటోలు మార్పించటానికివున్న శ్రద్ధ అక్కడ ప్రాథమిక సౌకర్యాల కల్పన మీద పెడితే ప్రజలు తమ గుండెల్లో మీ ఫోటోముద్రించుకుంటారన్నారు. తమకు నచ్చినచోట వైద్యం చేయించుకునే హక్కుప్రజలకు ఉంటుంది. ఆర్థికంగా ఖర్చు భరించగలిగిన వాళ్లు వెళతారు. మరి ఆ భారం భరించలేని వాళ్లపరిస్థితి ఏమిటి? అంటే వారికి ఆత్మగౌరవం ముఖ్యం కాదా? మంచినీళ్లను, సరైన టాయిలెట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేని మీ ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. హాస్పిటల్స్ ను గాలికొదిలేసిన పాపం మీదేనన్నారు.
ఒక పక్కన అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని ఎక్కడికో తీసుకుపోతామనే ప్రకటనలతో ప్రతిరోజూ దర్శనమిస్తారుకదా, ప్రభుత్వ హాస్పిటల్స్ లో పాయిఖానాల వ్యవస్థను సరిగ్గా నిర్వహించడం నేర్చుకుంటే అదే మీరుఇవ్వగలిగే మంచి పాలన అవుతుందని స్పష్టం చేశారు.  ప్రజారోగ్యం గురించి, ప్రభుత్వ హాస్పిటల్స్ ని నిలబెట్టడానికిఇంకా శ్రద్ధ పెట్టి ఆలోచించవలసిన అనేక అంశాలు వున్నాయి. అన్నీ ఒకదానికొకటి విడదీయరానివి. తాగునీరు, ఇతర నీటి సౌకర్యాలు, పాయిఖానాల నిర్వహణ కూడా అందులో అత్యంత ముఖ్యమైన భాగాలు.ప్రాథమిక సౌకర్యాలు లేకపోవటం వల్ల సామాన్య ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్స్ ని విడనాడే పరిస్థితులనుమార్చి, ప్రజారోగ్య, వైద్య వ్యవస్థలను బలోపేతం చేసే వైపుగా రాజకీయ వ్యవస్థ వుండాలని, ఆ దిశగాప్రభుత్వాలు పనిచేయాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *