బడుగులకు రాజ్యాధికారం పగటి కలేనా?

– ముద్దగౌని సుభాష్
సామాజిక ఉద్యమ రచయిత
ఫోన్: 9000904284

దగాపడ్డ దళితులారా! బహుజనులారా! బడుగు బలహీన వర్గాల ప్రజలారా! ఇక మనకు రాజ్యాధికారం పగటి కలే కాబోతుందా? పాలనా అధికారం పొందని బలహీన వర్గాల ప్రజలు, ఎప్పటికీ పేదలుగానే పాలితులుగానే ఉండి పోవలసిందేనా? తరతరాలుగా ఈ దేశంలో రాజ్యాధికారం, ఆధిపత్య కులాల పెత్తందారుల చేతుల్లో, సంపన్న వర్గాల చెరలో బంధీ అయి ఉంది! స్వాతంత్ర్యం వచ్చిన తొలి ఎన్నికల నుండే వీళ్ళు, అధికారం కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తూ నెగ్గుతూ.. ఇప్పుడు శాశ్వతంగా రాజ్యాధికారాన్ని వారి గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇందుకు ఎన్నో వ్యూహాలు ఎత్తుగడలు రూపొందిస్తూ ఉన్నారు!

ఆనాడు ఎన్నికల్లో రిగ్గింగులు, దాడులు, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్ళడం, ఓట్ల డబ్బాల్లో సిరా పోయడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు! మరి నేడు ఎన్నికల్లో ఏకంగా ఓటరుకు ఐదు వేల రూపాయలు, పది వేల రూపాయలు చొప్పున ఇస్తూ, కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారు! ప్రశ్నించిన వారిపై క్రూరమైన దాడులు చేస్తున్నారు! అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు! ఇప్పుడు ఏకంగా, వాళ్లకు నచ్చని కోట్లాదిమంది ప్రజల ఓట్లను, సర్ పేరుతో తొలగించారు! ఈ విధంగా అప్రజాస్వామిక విధానాల ద్వారా అధికారంలోకి చొరబడి.. రాజ్యాంగ బద్ధమైన సర్పంచ్ పదవుల నుండి, మంత్రి పదవుల దాకా.. అధికార పదవులన్నీ ఈ సంపన్న వర్గాలే అనుభవిస్తున్నారు! ఇక ఇప్పుడు ఏకంగా, ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులనే డైరెక్ట్ గా కొంటున్నారు, వాళ్ళ పార్టీల్లో చేర్చుకుంటున్నారు!

ఈ విధంగా ఎన్నికల వ్యవస్థను, ప్రభుత్వ పాలనను పూర్తిగా వ్యాపారమయం చేసిన ఈ స్వార్థ రాజకీయ నాయకుల తీరును చూస్తూ ఉంటే.. ఇక బడుగు బలహీన వర్గాల ప్రజలకు, భవిష్యత్తులో రాజ్యాధికారం పగటి కలే అని అనిపించడం లేదా? ఆలోచించండి. ప్రజల అస్తిత్వానికి చిరునామా అయిన, ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఈ ఎన్నికల వ్యవస్థను.. ఈ దళారీ వ్యాపార రాజకీయ నాయకులు ఈ విధంగా అప్రజాస్వామికంగా, నిట్ట నిలువునా తూట్లు పొడుస్తూ ఉంటే.. మనం ఇప్పటికీ కూడా సీరియస్ గా ప్రతిస్పందించక పోవడం, మన బాధ్యతా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం!

మిత్రులారా, ఇకనైనా కళ్లు తెరుద్దాం! ప్రజల్లో కనీస సామాజిక రాజకీయ చైతన్యాన్ని, కనీస రాజ్యాంగ స్పృహను పెంపొందించుదాం! రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థకు ఉండే, సామాజిక శక్తి ఏమిటో నిరూపిద్దాం! నిజమైన సామాజిక స్పృహ ఉన్న వారినే ఎన్నికల్లో గెలిపిద్దాం! ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి పోద్దాం! మన అస్తిత్వాలను, మన ఆత్మగౌరవాలను మనమే కాపాడుకుందాం! లేకుంటే మనకు, మన భవిష్యత్ తరాలకు.. అంధకారం బానిసత్వం తప్పా, మరేమీ మిగలదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *