వోటు హక్కుపై సాంకేతిక గోప్యత ఎందుకు?

“కరీంనగర్‌కు చెందిన వోటరు ఎం.ఏ. ముజీబ్ అయూబ్ సమాచార హక్కు చట్టం కింద ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్ పేరు, వెర్షన్, ఇతర సాంకేతిక వివరాలను కోరినట్లు వార్తలు వెల్లడించాయి. వాణిజ్య రహస్యాలు, మేధోసంపత్తి పరిరక్షణకు సంబంధించిన సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(డి)ని ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘం కొన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించినట్లు సమాచారం. అయితే వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని, కొనుగోలు చేయలేదని సంఘం స్పష్టం చేసినట్లు కూడా నివేదికలు పేర్కొన్నాయి..”

ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది ప్రజల వోటు హక్కు. ఆ హక్కును పరిరక్షించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం. వోటర్ల జాబితాల రూపకల్పన, సవరణ, పేర్ల చేర్పులు, తొలగింపుల వంటి కీలక ప్రక్రియల్లో పారదర్శకత పాటించడం ఎన్నికల సంఘం ప్రాథమిక బాధ్యత. అయితే ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడానికి ఎన్నికల సంఘం నిరాకరించినట్లు వెలువడిన వార్తలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రజల ప్రజాస్వామిక హక్కులను ప్రభావితం చేసే వ్యవస్థల పనితీరుపై ఎంతవరకు గోప్యత ఉండవచ్చన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. కరీంనగర్‌కు చెందిన వోటరు ఎం.ఏ. ముజీబ్ అయూబ్ సమాచార హక్కు చట్టం కింద ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్ పేరు, వెర్షన్, ఇతర సాంకేతిక వివరాలను కోరినట్లు వార్తలు వెల్లడించాయి. వాణిజ్య రహస్యాలు, మేధోసంపత్తి పరిరక్షణకు సంబంధించిన సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(డి)ని ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘం కొన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించినట్లు సమాచారం. అయితే వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని, కొనుగోలు చేయలేదని సంఘం స్పష్టం చేసినట్లు కూడా నివేదికలు పేర్కొన్నాయి.

సాంకేతిక భద్రత పేరుతో ప్రజాప్రయోజనాలకు సంబంధించిన ప్రతి సమాచారాన్నీ గోప్యంగా ఉంచడం సమర్థనీయం కాదు. సాఫ్ట్‌వేర్ సోర్స్ కోడ్, భద్రతా నిర్మాణం వంటి సున్నితమైన అంశాలను పరిరక్షిస్తూనే, వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, పొరపాట్లను ఎలా గుర్తిస్తుంది, వాటిని ఎలా సరిచేస్తుంది అనే వివరాలను ప్రజలకు తెలియజేయవొచ్చు. వోటర్ల జాబితాల్లో పొరపాట్లు కేవలం పరిపాలనాపరమైన లోపాలు కావు. అర్హుడైన పౌరుడి పేరు జాబితా నుంచి తొలగిపోతే అతని రాజ్యాంగబద్ధ ప్రజాస్వామిక హక్కు వినియోగానికి ఆటంకం ఏర్పడుతుంది. ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు, వృద్ధులు, ఆదివాసీలు, అట్టడుగు వర్గాల ప్రజలు ఇటువంటి పొరపాట్ల వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదముంది. అందువల్ల వోటర్ల వివరాల పరిశీలనలో మానవ పర్యవేక్షణ, ముందస్తు నోటీసులు, అభ్యంతరాల స్వీకరణ, అప్పీళ్ల పరిష్కారం తప్పనిసరిగా ఉండాలి.

ఎన్నికల సంఘం మాత్రం వోటర్ల పేర్ల చేర్పు, తొలగింపులపై తుది నిర్ణయం సంబంధిత ఎన్నికల నమోదు అధికారులదేనని చెబుతున్నది. ఈ వివరణతోపాటు సాంకేతిక వ్యవస్థ సూచించిన అనుమానాస్పద నమోదులను అధికారులు ఏ ప్రమాణాల ఆధారంగా పరిశీలిస్తున్నారో వెల్లడించాలి. కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారా? తప్పుగా గుర్తించిన నమోదులను సరిదిద్దేందుకు ఎలాంటి రక్షణలున్నాయి? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు అవసరం.

సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(డి)లో ప్రజాప్రయోజనాల దృష్ట్యా సమాచార వెల్లడికి అవకాశం కూడా ఉంది. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలించాలి. అవసరమైతే స్వతంత్ర సాంకేతిక నిపుణులతో ఆడిట్ నిర్వహించి, భద్రతకు హాని కలిగించని ఫలితాలను బహిరంగపరచాలి. ఎన్నికల సంఘం ఇప్పటికే ఈసీఐనెట్ పరిశీలనకు స్వతంత్ర నిపుణుడు భాగస్వామిగా ఉండే కమిటీని ప్రకటించింది. ఆ పరిశీలన ఫలితాలపై కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఎన్నికల సంఘం స్వతంత్రతకు ప్రజల విశ్వాసమే అసలైన బలం. ఆ విశ్వాసాన్ని ఆదేశాలతోనో, గోప్యతతోనో సాధించలేం. పారదర్శకత, నిష్పాక్షికత, జవాబుదారీతనంతోనే నిలబెట్టుకోగలం. వోటర్ల సమాచారం ప్రజాస్వామ్యానికి సంబంధించినది. దాని నిర్వహణలో ప్రజల హక్కులే పరమ ప్రమాణం కావాలి. సాంకేతిక పరిజ్ఞానం వోటు హక్కును పరిరక్షించే సాధనంగా ఉండాలి తప్ప అనుమానాలకు కారణం కాకూడదు.
-ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *