– మొదటి దశలో 7,448 కి.మీ మేర రోడ్ల అభివృద్ధి
– ఎల్‌నినో ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి
– ప్రాంతీయ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క దిశానిర్దేశం
హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : గ్రామీణ తెలంగాణకు శాశ్వత మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క స్పష్టం చేశారు. హనుమకొండ కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశం మంత్రి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. గ్రామీణ రహదారుల అభివృద్ధిలో హ్యామ్ రోడ్లు గేమ్ ఛేంజర్‌గా నిలవనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆవాసం నుంచి రాష్ట్ర రాజధానికి రహదారి సదుపాయం కల్పించడమే ఈ విధానం ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో 7,448 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు. దసరా నాటికి అన్ని ప్యాకేజీల్లో పనులు ప్రారంభం కావాలని, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు వేగంగా పనిచేసి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.
నీటి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం
అక్టోబర్ 2026 నుంచి జూన్ 2027 వరకు ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామస్థాయిలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఎల్‌నినో నేపథ్యంలో నీటి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి జలాశయంలో నీటి మట్టాలను ప్రతిరోజూ పర్యవేక్షించి ఏడాది తాగునీటి అవసరాలను నిర్ధారించుకోవాలని సూచించారు. మిషన్ భగీరథలో సమస్యాత్మకంగా ఉన్న 86 జనావాసాల్లో నీటి సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి పొలానికి పంట కుంట.. ప్రతి గ్రామానికి ఊటకుంట అనే లక్ష్యంతో పనులు చేపట్టాలని సూచించారు.
కూలీకి పని.. గ్రామానికి శాశ్వత ఆస్తి
గ్రామాల్లో కూలీలకు పని కల్పించడంతోపాటు గ్రామానికి శాశ్వత ఆస్తులను సృష్టించే దిశగా అడుగులు వేయాలన్నారు. గ్రామ పంచాయతీ, వీఓ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనుల పురోగతిని వేగవంతం చేయాలన్నారు. అక్టోబర్ 2న జరిగే గ్రామ సభల్లో వచ్చే ఏడాది పనులను ప్రజలతో చర్చించి ఆమోదించాలని సూచించారు. సమస్యను కేవలం గుర్తించడం మాత్రమే కాదని.. అది పరిష్కారం అయ్యే వరకు అధికారులే పూర్తి బాధ్యత వహించి పనిచేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, అడిషనల్ కలెక్టర్లు, మిషన్ భగీరథ ఈ ఎన్సీ కృపాకర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఎన్‌సీ జగదీశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





