ఉంగాండా మహిళలో ఎబోలా లక్షణాలు

బెంగళూరుకు చేరుకున్న వెంటనే హాస్పిటల్‌కు తరలింపు

బెంగళూరు, మే 27: ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోన్న ఎబోలాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న క్రమంలో బెంగళూరులో ఉగాండాకు చెందిన మహిళకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఆ మహిళ (28) ఈనెల 23న ఉగాండా నుంచి కెంపెగౌడ విమానాశ్రయంలో దిగారు. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు అధికారులు స్క్రీనింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఆమెలో ఈ వ్యాధికి సంబంధించి తేలికపాటి లక్షణాలను గుర్తించారు. ఆమెలో ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలను ఎయిర్‌పోర్టు సిబ్బంది గుర్తించి వెంటనే బెంగళూరు ఇందిరానగర్‌లోని ప్రభుత్వ అంటువ్యాధుల హాస్పిటల్‌కు తరలించి ఐసోలేట్ చేశారు. ఆమె శాంపిల్స్ సేకరించి, పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. రెండు రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిత్విక్ రంజన్‌పాండే మాట్లాడుతూ ప్రస్తుతం ఆమె వైద్యాధికారుల పర్యవేక్షణలో ఉందని, ఆమెలో కనిపించిన లక్షణాలు ఎబోలాకు సంబంధించినవేనా కాదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని అన్నారు. మరోవైపు దేశంలో ఎబోలా వైరస్ వ్యాధి కేసులు నమోదు కాలేదని, ప్రయాణికురాలి పరిస్థితి నిలకడగానే ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎబోలాకు రష్యన్ వ్యాక్సిన్

మాస్కో, మే 27 : ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. బుండిబుగ్యో ఎబోలాకు వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ఆరోగ్య మంత్రి మురాష్కో పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలోని రష్యా దౌత్యకార్యాలయం ఈ మేరకు ఎక్స్‌లో ప్రకటన చేసింది. రష్యన్ శాస్త్రవేత్తలు కొత్త ఎబోలా స్ట్రెయిన్ కోసం విజయవంతమైన వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు తెలిపింది. ఇది బుండిబుగ్యో స్ట్రెయిన్ నుంచి రక్షణ కల్పిస్తుందని వెల్లడించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *