– బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు డిమాండ్
– నిరుద్యోగులను అవమానించడంపై ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని ఉద్యోగాలిస్తామని హామీలు గుప్పించిన మీరు ఇప్పుడు ఆ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకొస్తే వారిపై ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అని అసెంబ్లీలో బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఓ ప్రకటనలో నిలదీశారు. హైడ్రాలో 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాదిమంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారని, ఇది నిరుద్యోగుల తప్పా.. లేక ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన మీ ప్రభుత్వం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులను ముఖ్యమంత్రి స్థాయిలో క్రిమినల్ వేస్ట్ అని అవమానించడం, ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడటం చూస్తుంటే ‘యథా రాజా.. తథా అధికారులు’ అన్న సామెత గుర్తుకొస్తోందన్నారు. అధికారుల నోటివెంట ఇలాంటి మాటలు రావడం బాధాకరమన్నారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులు వారినే అవమానిస్తే ఇక ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు అని అడిగారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి 32 నెలలు దాటింది.. ఆ హామీ ఏమైంది అని అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా భర్తీ చేసి ఉంటే ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాదిమంది నిరుద్యోగులు ఇలా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా అన్నారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ బోగస్.. జాబ్ క్యాలెండర్ బోగస్.. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు బోగస్ అని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతలో నిరాశ పెరుగుతోందని, నోటిఫికేషన్లు సక్రమంగా రాకపోవడంతో పీజీ, పీహెచ్‌డీలు చేసిన యువత కూడా చిన్నచిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలివ్వడం లేదు.. భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి విద్యార్థులపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని విమర్శించారు. రేవంత్ రెడ్డీ.. హామీలను అమలు చేయాలని నిరుద్యోగులు అడుగుతున్నారు.. ఉద్యోగం అడగడం, ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం నేరం కాదంటూ ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగులను గౌరవించడం నేర్చుకోవాలి అని హితవు పలికారు. నిరుద్యోగులపై అనుచితంగా, అసభ్యంగా మాట్లాడిన అధికారులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, విద్యార్థి, నిరుద్యోగ లోకానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





