హనుమకొండకు 7 కోర్టులు.. వరంగల్‌కు 5 మంజూరు
హనుమకొండ, సెప్టెంబర్ 25 : తెలంగాణలో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా న్యాయవ్యవస్థ పరిధిలో 200 కొత్త అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయశాఖ జీవో ఎంఎస్ నెం.59, తేదీ 24-09-2026ను జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) రాష్ట్రంలో 594 కొత్త కోర్టుల ఏర్పాటుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు, పునరావృత–పునరావృతేతర వ్యయాలకు బడ్జెట్‌తో సహా అనుమతి కోరగా, ప్రభుత్వం పరిశీలన అనంతరం తొలి విడతలో 200 కోర్టులకు అనుమతి ఇచ్చింది. అవసరమైన సిబ్బంది, ఇతర వ్యయాలకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. తదుపరి చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం కోరింది.
ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి కూడా ప్రాధాన్యం లభించింది. జీవోకు జతచేసిన జాబితా ప్రకారం హనుమకొండ జిల్లా పరిధిలో హనుమకొండలో 6, పరకాలలో ఒకటి కలిపి మొత్తం 7 కొత్త కోర్టులు మంజూరయ్యాయి. వరంగల్ జిల్లా పరిధిలో వరంగల్ ఎట్ హనుమకొండలో 4, నర్సంపేటలో ఒకటి కలిపి మొత్తం 5 కోర్టులు ఏర్పాటు కానున్నాయి. అదేవిధంగా జనగామలో 2, స్టేషన్ ఘన్‌పూర్‌లో ఒకటి; జయశంకర్ భూపాలపల్లిలో 2; ములుగులో ఒక కొత్త కోర్టును ప్రతిపాదిత జాబితాలో పొందుపరిచారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 200 కోర్టుల కేటాయింపును అనుబంధ జాబితాలో ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త కోర్టుల ఏర్పాటు ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారానికి అదనపు న్యాయస్థానాల సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని జీవోలో పేర్కొన్నారు.





