నిధులు, కీలక సంస్థలు తీసుకురావాలి

– కాకతీయ వర్సిటీకి పీఎం-ఉష నిధుల కోసం కేంద్రాన్ని కోరాలి
– పురావస్తు మ్యూజియానికి రూ.10 కోట్లు మంజూరు చేయించాలి
– వరంగల్‌లో నైలిట్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రంతో మాట్లాడండి
– సీఐటీడీ ఏర్పాటుతో యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అవకాశాలు
– వరంగల్‌లో పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అవసరం
– కేంద్రం పరిధిలోని అంశాలపై సీఎంని కలిసిన ఎంపీ డాక్టర్ కావ్య

వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : వరంగల్ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శుక్రవారం కలిసి వినతిపత్రాలు అందజేశారు. కాకతీయ యూనివర్సిటీకి పీఎం-ఉష నిధుల మంజూరు, వరంగల్ కోటలో పురావస్తు మ్యూజియం అభివృద్ధికి కేంద్ర నిధులు, వరంగల్‌లో నైలిట్, సీఐటీడీ కేంద్రాల ఏర్పాటు, పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అంశాలను ముఖ్యమంత్రికి ఎంపీ వివరించారు.

కాకతీయ యూనివర్సిటీకి పీఎం-ఉష నిధులు

కాకతీయ యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు పీఎం-ఉష పథకం కింద ప్రతిపాదించిన నిధులను కేంద్రం నుంచి త్వరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ డాక్టర్ కావ్య కోరారు. విశ్వవిద్యాలయంలో విద్యా, పరిశోధన, మౌలిక వసతులను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులు, పరిశోధకులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు.

పురావస్తు మ్యూజియానికి రూ.10 కోట్లు

వరంగల్ కోటలో పురావస్తు మ్యూజియం అభివృద్ధికి కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి రూ.10 కోట్లు మంజూరు చేయించేలా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రిని కోరారు. 1991లో ఏర్పాటు చేసిన ప్రస్తుత మ్యూజియం భవనం శిథిలావస్థకు చేరిందని, కొత్త భవన నిర్మాణం 2023 మేలో పూర్తయినప్పటికీ కళాఖండాల తరలింపు, పరిరక్షణ, ప్రదర్శన వసతులు, భద్రత, వాతావరణ నియంత్రణ తదితర పనులు చేపట్టాల్సి ఉందని వివరించారు. 2026-31కు సంబంధించిన సవరించిన మ్యూజియం గ్రాంట్ పథకం మార్గదర్శకాలు వెలువడిన అనంతరం ప్రతిపాదన సమర్పించాల్సి ఉన్నందున ఆ మేరకు కేంద్రంతో సమన్వయం చేయాలని కోరారు.

వరంగల్‌లో నైలిట్ కేంద్రం

వరంగల్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలిట్) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రమే ఉన్న ఈ సంస్థకు వరంగల్‌లో కేంద్రం ఏర్పాటు చేస్తే వరంగల్‌తోపాటు పరిసర జిల్లాల విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ తదితర రంగాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన శిక్షణ, ధ్రువపత్రాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

సీఐటీడీ ఏర్పాటుకు విజ్ఞప్తి

వరంగల్‌లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డాక్టర్ కావ్య కోరారు. ఇంజినీరింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులు, నైపుణ్యం కలిగిన యువత, ఎంఎసఎంఈలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. టూల్ అండ్ డై డిజైన్, సీఎడీ/సీఏఎం, సీఏన్‌సీ మిషనింగ్, మౌల్డ్ తయారీ, ప్రెసిషన్ ఇంజినీరింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్, 3డీ ప్రింటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ అందించడంతోపాటు స్థానిక పరిశ్రమలకు సాంకేతిక సహకారం లభిస్తుందని వివరించారు. కేంద్ర ఎంఎసఎంఈ శాఖతో సంప్రదించి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

పాస్‌పోర్టు సేవా కేంద్రం

వరంగల్‌లో ప్రస్తుత పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రం (పీవోపీఎస్‌కే) స్థానంలో పూర్తిస్థాయి పాస్‌పోర్టు సేవా కేంద్రం(పీఎస్‌కే) ఏర్పాటు చేయాలని డాక్టర్ కావ్య విజ్ఞప్తి చేశారు. 2017 మార్చి 29న ఏర్పాటు చేసిన పీవోపీఎస్‌కే ద్వారా ప్రాంత ప్రజలకు సేవలు అందుతున్నాయని, పాస్‌పోర్టు సేవలకు డిమాండ్ పెరుగుతోందని, తత్కాల్ పాస్‌పోర్టు సేవల కోసం కరీంనగర్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. వరంగల్-హనుమకొండ-కాజీపేట త్రినగర ప్రాంతంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా తగిన మౌలిక వసతులు, సిబ్బందితో పూర్తిస్థాయి పీఎస్‌కే ఏర్పాటు చేయాలని కేంద్ర విదేశాంగ శాఖతో మాట్లాడాలని ముఖ్యమంత్రిని ఎంపీ కోరారు. వరంగల్ ప్రాంత విద్యార్థులు, యువత, పరిశోధకులు, ప్రజలకు మెరుగైన విద్య, నైపుణ్య, సాంకేతిక, కేంద్ర ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు కాకతీయుల చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించే చర్యలకు కేంద్ర సహకారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిరిని కోరారు. ఆమెతోపాటు స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి కూడా ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *