– నాణ్యత, శాస్త్ర విషయాల్లో రాజీ వద్దు
– భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొంగులేటి
భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా వేగం పెంచాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణతో పనులు నిర్వహించాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం భద్రాచలం వచ్చిన ఆయన ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజులతో కలిసి మంత్రి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఉత్తర ద్వారం వద్ద ఉన్న దమ్మక్క విగ్రహం ప్రాంతం నుంచి పరిశీలన ప్రారంభించి వివిధ నిర్మాణ పనుల పురోగతి, ప్రస్తుత దశ, పూర్తికి అవసరమైన సమయం, మానవ వనరులు, నిర్మాణ సామగ్రి తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లిఫ్టులు, స్లాబ్‌లు, రాతి పనులు, రహదారుల అభివృద్ధి, నిర్మాణ సామగ్రి లభ్యత, సిబ్బంది సమీకరణ, అదనపు నిధులు, సాంకేతిక సమన్వయం తదితర అంశాలపై పనుల వారీగా పురోగతిని పరిశీలించారు. ప్రతి విభాగానికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించి వారంవారీ ప్రణాళిక ప్రకారం పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సుమారు రూ.275 కోట్లT మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే పనులు వేగం పుంజుకున్నాయని చెప్పారు. శ్రీరామనవమికి ముందుగానే ప్రధాన పనులు పూర్తయ్యేలా రివర్స్ ప్లానింగ్ రూపొందించుకోవాలని, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయం, మాడ వీధులు, అంతర్గత ప్రాకారం, బాహ్య ప్రాకారం తదితర ప్రాంతాల్లో చేపడుతున్న పనులను ముందుగానే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రతి మూడు రోజులకు ఒక లిఫ్ట్ పనిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణ సామగ్రి అందుబాటులో లేక పనులకు అంతరాయం కలగకుండా ముందుగానే సిద్ధంగా ఉంచాలని, అవసరమైనచోట బూమ్ పంపులు, ఇతర యంత్ర పరికరాలను వినియోగించి పనుల సామర్థ్యాన్ని పెంచాలని తెలిపారు. స్లాబ్ పనుల్లో ఒక దశ పూర్తయ్యేసరికి తదుపరి దశకు సంబంధించిన ఏర్పాట్లు ఆలస్యం కాకుండా సమాంతరంగా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. 
పనుల మధ్య ఖాళీ సమయం తగ్గించి నిరంతరాయంగా నిర్మాణ కార్యకలాపాలు కొనసాగేలా సమన్వయం చేసుకోవాలని చెప్పారు. రాతి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన నిపుణులు, సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించి రోజువారీ లక్ష్యాలతో పనులు నిర్వహించాలని తెలిపారు. గతంలో చేపట్టిన భారీ ఆలయ, జాతర ప్రాంతాల నిర్మాణ పనుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఆలయ నిర్మాణంలో నాణ్యతతోపాటు శాస్త్రోక్తతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. ఆలయ సంప్రదాయాలు, నిర్మాణ విధానాలకు అనుగుణంగా పనులు సాగుతున్నాయా అనే అంశాన్ని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. నిర్మాణ నాణ్యతలో ఎలాంటి లోపాలకు తావులేకుండా పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసర రహదారుల అభివృద్ధికి సంబంధించి సుమారు రూ.25 కోట్ల ప్రతిపాదనను త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆలయ పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఇంజనీరింగ్ అధికారులు, ఆర్కిటెక్టులు, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





