ఉమ్మడి వ్యూహమే రక్షణ కవచం!

నేటి డిజిటల్, గ్లోబల్ యుగంలో శాంతిభద్రతల పరిరక్షణ అనేది ఒకే రాష్ట్రానికో లేదా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికో పరిమితమైన అంశం కాదు. నేరాల స్వరూపం, నేరగాళ్ల వ్యూహాలు శరవేగంగా మారుతున్న తరుణంలో, వివిధ రాష్ట్రాల పోలీస్ యంత్రాంగాలు పరస్పర సమన్వయంతో పనిచేయడం అత్యంత అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో, భాగ్యనగరం వేదికగా జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోలీస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐదు దక్షిణాది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీస్ బాస్‌లు ఒకే తాటిపైకి వొచ్చి అంతర్గత భద్రత, అంతరాష్ట్ర నేరాల అదుపుపై మేధోమథనం చేయడం కాలోచితమైన పరిణామం. సరిహద్దు రేఖలు కేవలం పాలనా సౌలభ్యం కోసమే కానీ, శాంతిభద్రతల రక్షణలో అవి ఆటంకాలు కాకూడదనే స్పష్టమైన సందేశాన్ని ఈ సదస్సు ఇచ్చింది.

ప్రస్తుత సమాజానికి సైబర్ నేరాలు ఒక పెను సవాల్‌గా మారాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కేటుగాళ్లు సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఎక్కడో కూర్చుని అమాయక ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. ఒక రాష్ట్రంలో నేరానికి పాల్పడి, మరో రాష్ట్రంలో తలదాచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ సదస్సులో సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించడం అభినందనీయం. ఈ రంగంలో తెలంగాణ పోలీస్ యంత్రాంగం సాధించిన విజయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం (పీఎంఓ) నిర్వహించిన జాతీయ స్థాయి ‘ప్రగతి’ సమీక్షలో తొమ్మిది కీలక పారామీటర్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సైబర్ భద్రత అమల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సైబర్ క్రైమ్ ఎఫ్‌ఐఆర్‌లలోదాదాపు 44 శాతం (21,639 ఎఫ్‌ఐఆర్‌లు) కేవలం తెలంగాణలోనే నమోదు కావడం రాష్ట్ర పోలీసుల తక్షణ స్పందనకు నిదర్శనం. అంతేకాదు, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా కేవలం గత రెండేళ్లలోనే బాధితులకు సంబంధించిన రూ. 455 కోట్ల కంటే ఎక్కువ మోసపూరిత సొమ్మును రికవరీ చేయడం విశేషం. సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే కేవలం సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోదు, రాష్ట్రాల మధ్య తక్షణ సమాచార మార్పిడి జరగాలి. ఒక రాష్ట్రంలో నమోదైన సైబర్ క్రిమినల్ ఐపీ అడ్రస్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలు తక్షణమే పొరుగు రాష్ట్ర పోలీసులకు చేరినప్పుడే నిందితులను వేగంగా పట్టుకోవడం సాధ్యమవుతుంది.

దీనికితోడు, అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో క్షేత్రస్థాయి పోలీసుల మధ్య సమన్వయం లోపించడం వల్ల అనేక సందర్భాల్లో నిందితులు తప్పించుకుంటున్నారు. ఒక రాష్ట్ర పోలీసులు నిందితుడిని వెంటాడుతూ వెళ్లినప్పుడు, పొరుగు రాష్ట్ర పోలీసుల నుంచి తక్షణ మద్దతు లభించేలా పరిపాలనాపరమైన ప్రోటోకాల్స్‌ను సులభతరం చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఉన్నతాధికారుల స్థాయిలోనే కాకుండా, సరిహద్దు పోలీస్ స్టేషన్ల సిబ్బంది సైతం నిరంతరం వాట్సాప్ గ్రూపులు లేదా ప్రత్యేక కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల ద్వారా అనుసంధానమై ఉండాలి. అలాగే, నేరాల పరిశోధనలో ఆధునిక ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉమ్మడిగా ఎలా వాడుకోవాలో కూడా ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న అధునాతన శిక్షణా పద్ధతులను, పరిశోధనా నైపుణ్యాలను మిగిలిన రాష్ట్రాల సిబ్బందికి కూడా బదిలీ చేసేలా ‘పోలీస్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్’ నిర్వహించడం వల్ల మొత్తం దక్షిణాది పోలీసింగ్ వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది.

మరోవైపు, యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకలించడంపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల గుండా సాగుతున్న ఈ నల్లదందా ఉమ్మడి వ్యూహంతోనే సాధ్యమవుతుంది. అంతరాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేయడం, డ్రగ్స్ సప్లై చైన్‌ను దెబ్బతీయడంపై డీజీపీలు ఒక అవగాహనకు రావడం శుభపరిణామం. మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్), ఉగ్ర వాదుల కదలికలను కనిపెట్టడం, నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకోవడం వంటి అంశాల్లో కూడా ఉమ్మడి కార్యాచరణ అవసరమని ఈ సమావేశం నొక్కిచెప్పింది. అయితే, ఇలాంటి ఉన్నత స్థాయి సమావేశాలు కేవలం తీర్మానాలకు, ఉమ్మడి ప్రకటనలకే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో వీటి అమలు అత్యంత ముఖ్యం.

రాష్ట్రాల మధ్య ఇంటెలిజెన్స్ (నిఘా) సమాచారాన్ని పంచుకోవడంలో ఎలాంటి ఆలస్యం జరగని రీతిలో ఒక శాశ్వత సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఇటువంటి ఆధునిక మౌలిక వసతులు, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా పంచుకోవాలి. శాంతిభద్రతలు సజావుగా ఉన్నప్పుడే పెట్టుబడులు వొస్తాయి , పారిశ్రామిక వృద్ధి సాధ్యమవుతుంది. ఆర్థికంగా దేశంలోనే కీలకమైన దక్షిణాది రాష్ట్రాల రక్షణ, దేశ ప్రగతికి చోదక శక్తి వంటిది. నేరగాళ్లు ఆధునిక సాంకేతికతతో ముఠాలుగా ఏర్పడుతున్నప్పుడు, వారిని ఎదుర్కొనే పోలీస్ యంత్రాంగం అంతకంటే వేగంగా, సమైక్యంగా స్పందించాలి. హైదరాబాద్ సదస్సులో కుదిరిన అంగీకారాలు, వ్యూహాలు త్వరలోనే క్షేత్రస్థాయి ఫలితాలను ఇస్తాయని, దక్షిణాదిని నేరరహిత ప్రాంతంగా మార్చడంలో మైలురాయిగా నిలుస్తుందని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *