ఎస్బీఐ డేటా లీక్: డిజిటల్ భారత్‌కు హెచ్చరిక!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, సుమారు 3.75 లక్షల రికార్డులను పరిశీలించగా.. అందులో 3,897 మంది వినియోగదారుల పేర్లు, మొబైల్ నెంబర్లు, ఈమెయిల్స్, పుట్టిన తేదీలు, చిరునామాలు, లోన్ వివరాలు వంటి అత్యంత గోప్యమైన సమాచారం  బయటపడినట్లు బ్యాంక్ ధ్రువీకరించింది. నిజంగా ఈ లీక్ దేశ ఆర్థిక వ్యవస్థకు, డిజిటల్ భద్రతా వ్యవస్థకు ఒక తీవ్రమైన హెచ్చరిక. ఇది కేవలం ఒక సాంకేతిక లోపం మాత్రమే కాదు; దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి, డిజిటల్ నమ్మకానికి పొంచి ఉన్న  ప్రమాదం.అయితే కోర్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి భంగం కలగలేదని బ్యాంక్ చెబుతున్నప్పటికీ, అసలు ఈ వైఫల్యం ఎక్కడ జరిగింది? డేటా లీకైన సంగతి బ్యాంక్ స్వయంగా గుర్తించకుండా, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ , ‘సిరియుసిమ్’(Siriusim) అనే హ్యాకర్ల బృందం ప్రకటన ద్వారా బయట ప్రపంచానికి తెలియడం ఆందోళనకరం.

భారతదేశంలో డిజిటలైజేషన్ , ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరగాళ్ల వ్యూహాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికత దుండగుల చేతుల్లోకి వెళ్తే జరిగే నష్టం ఊహాతీతం. అత్యాధునిక ఏఐ మోడల్స్ డిజిటల్ వ్యవస్థల్లోని లొసుగులను నిమిషాల వ్యవధిలో స్పై (గూఢచర్యం) చేసి, దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మన సైబర్ రక్షణ కవచాలను యుద్ధప్రాతిపదికన బలోపేతం చేసుకోవడం తక్షణ కర్తవ్యం. నేటి కాలంలో డిజిటలైజేషన్ వేగంగా పెరుగుతుండటంతో పాటు, హ్యాకర్ల చేతుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆయుధాలు వొచ్చి ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. సాంప్రదాయ సైబర్ దాడుల కంటే ఏఐ ఆధారిత దాడులు మరింత ప్రమాదకరమైనవి.

స్వయంప్రతిపత్తి ఏఐ ఏజెంట్లు  వ్యవస్థల్లోని బలహీనతలను క్షణాల్లో పసిగట్టి, క్లౌడ్ సిస్టమ్స్ లేదా కోడ్ రిపాజిటరీల్లో వదిలేసిన క్రెడెన్షియల్స్ ద్వారా సులువుగా లోపలికి ప్రవేశించగలవు. ప్రస్తుత సైబర్ ముప్పు కేవలం మాల్వేర్ లేదా పిషింగ్ (Phishing) దాడులకే పరిమితం కావడం లేదు. హ్యాకర్లు ఇప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్  , జెనరేటివ్ ఏఐ సాంకేతికతలను వాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థల్లోని సాఫ్ట్‌వేర్ కోడ్ బలహీనతలను అటోమేటెడ్‌గా స్కాన్ చేస్తున్నారు. వీటి ద్వారా సంక్లిష్టమైన జీరో-డే వల్నరబిలిటీస్, కాన్ఫిగరేషన్ లోపాలను  అతి తక్కువ సమయంలోనే గుర్తించి సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.బ్యాంకుల అంతర్గత భద్రతా లోపాలు లేదా క్లౌడ్ స్టోరేజ్ హార్డెనింగ్ లేకపోవడం వల్లే ఇలాంటి డేటా ఉల్లంఘనలు జరుగుతున్నాయి. మన ఆర్థిక రంగాన్ని కాపాడుకోవడానికి సాంప్రదాయ ఐటీ సెక్యూరిటీ మోడల్స్ నుండి మారి, జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్  , రన్-టైమ్ అప్లికేషన్ సెల్ఫ్-ప్రొటెక్షన్ (ఆర్ఏఎస్పీ) వంటి అత్యాధునిక రక్షణ వలయాలను నిర్మించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

డేటా ముప్పులు మునుపెన్నడూ లేనంత సంక్లిష్టంగా మారినందున, ‘ఏఐ ఆర్మరీ’ (ఏఐ సాంకేతికతతో కూడిన రక్షణ వ్యవస్థ) అభివృద్ధిని భారతదేశ సార్వభౌమత్వ వ్యూహంలో ఒక భాగంగా మార్చాలి. భారతదేశం డిజిటల్ సార్వభౌమత్వం గురించి మాట్లాడుతున్న ఈ తరుణంలో, మన డేటాను కాపాడుకోవాలంటే కేవలం ఫైర్వాల్స్ సరిపోవు. కృత్రిమ మేథస్సు సాయంతో పనిచేసే అత్యాధునిక సైబర్ డిఫెన్స్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం అత్యవసరం. ఇందుకోసం  కేవలం విదేశీ సాఫ్ట్‌వేర్‌లపై ఆధారపడకుండా, స్వదేశీ సైబర్ రక్షణ వ్యవస్థలను నిర్మించుకోవాలి. దేశ ప్రగతికి వెన్నెముక లాంటి ఆర్థిక రంగాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చడమే మన మొదటి ప్రాధాన్యత కావాలి. అప్పుడే కోట్ల మంది ప్రజల కష్టార్జితానికి, వారి నమ్మకానికి పూర్తి భద్రత లభిస్తుంది. ప్రభుత్వాలు, బ్యాంకింగ్ రంగాలు ఇప్పటికైనా మేల్కొని ఏఐ ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ఈ ఘటన హెచ్చరిస్తున్నది. హ్యాకర్ల చేతుల్లోకి అత్యాధునిక ఏఐ టూల్స్ వెళ్తే, అవి సిస్టమ్స్ లోని లోపాలను ఆటోమేటిక్‌గా వెతికి దాడులు చేయగలవు. అందువల్ల సైబర్ డిఫెన్స్ , ఏఐ సెక్యూరిటీని జాతీయ భద్రతతో సమానంగా పరిగణించాలి.
ముందుగా బ్యాంకులు కొన్ని పటిష్ట చర్యలు చేపట్టాలి. బయట నుంచి సమాచారం వొచ్చేవరకు వేచి చూడకుండా, అంతర్గతంగా నిరంతర ఆడిటింగ్ , థ్రెట్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలి.డేటా లీక్ అయిన వెంటనే ప్రభావితమైన వినియోగదారులను అప్రమత్తం చేసి, వారికి భరోసా కల్పించడం బ్యాంకుల బాధ్యత.  హ్యాకర్ల కంటే ముందే మన సైబర్ భద్రతా బలగాలకు ఏఐ ఆధారిత రక్షణ కవచాన్ని అందించడానికి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. డిజిటల్ సార్వభౌమత్వాన్ని సాధించాలంటే ఆర్థిక రంగ భద్రతే ప్రథమ ప్రాధాన్యం కావాలి. హ్యాకర్ల ‘ఏఐ’ వ్యూహాలను తిప్పికొట్టేలా మన రక్షణ వ్యవస్థలను అత్యాధునిక సాంకేతికతతో బలోపేతం చేయాలి. అప్పుడే కోట్లాది మంది వినియోగదారుల నమ్మకం, దేశ ఆర్థిక మూలాలు సురక్షితంగా ఉంటాయి. ప్రభుత్వాలు, బ్యాంకులు తక్షణమే సమగ్ర సైబర్ రక్షణ కవచాన్ని  ఏర్పాటు చేయడమే దీనికి ఏకైక పరిష్కారం. డిజిటల్ ఇండియా విజయం కేవలం ఆన్‌లైన్ లావాదేవీల సంఖ్యపై కాదు… వినియోగదారుని డేటా సురక్షితంగా ఉన్నప్పుడే దాని అసలు విలువ నిలబడుతుంది. లేదంటే డిజిటల్ ప్రగతి కాస్తా ఆర్థిక మోసాలకు కేంద్రమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *