– మంత్రులు సీతక్క, అడ్లూరి పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : గిరిజనుల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం పోరాడిన కొమురం భీం ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కలలుగన్న సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. కెరమేరి మండలం జోడేఘాట్లోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో భీం జెండాను ఆవిష్కరించి ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భీం సమాధి వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దర్బార్, వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ కొమురం భీం, సమ్మక్క-సారలమ్మలు ప్రజలు స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో పోరాడారని గుర్తు చేశారు. నేటికీ గిరిజన గ్రామాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ నిబంధనలు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయన్నారు. పేదల కనీస అవసరాల కోసం చేపట్టే పనులకు నిబంధనల సాకుగా అధికారులు అడ్డంకులు సృష్టించడం సరైన పద్ధతి కాదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించే అధికారులను గిరిజనులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. గిరిజన జాతి అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన కొమురం భీం వంటి పోరాట యోధులకు ఘనంగా నివాళులర్పించడం ద్వారా వారి త్యాగాలను, ఆశయాలను గౌరవించినవారమవుతామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించి వాటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ ఒక రోజు ఈ ప్రాంతంలోనే ఉండి అత్యవసర పనులపై ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు వెల్లడించారు. వాటి ఆధారంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం రూ.180 కోట్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఐటీడీఏలను మరింత అభివృద్ధి చేసి గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్ సమన్వయంతో రూపొందించే ప్రతిపాదనల ఆధారంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. టైగర్ జోన్కు సంబంధించి ప్రస్తావించిన జీవో నంబర్ 49ను తమ ప్రభుత్వం ఉన్నంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస సదుపాయాలు కల్పించడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తామన్నారు. కొమురం భీం పోరాట మార్గం గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధికి స్ఫూర్తిగా నిలుస్తుందంటూ ఆయన ఆశయాలను ఆచరణలోకి తేవడమే నిజమైన నివాళి అని చెప్పారు.
గోయగంలో మిషన్ అమృత్ జల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
మండలంలోని గోయగం గ్రామంలో మిషన్ అమృత్ జల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి సీతక్క ప్రారంభించారు. జోడేఘాట్ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తూ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు ఉద్దేశం, ప్రారంభానికి దారితీసిన పరిస్థితులను జిల్లా కలెక్టర్ కె.హరిత మంత్రికి వివరించారు. గోయగంలో కిడ్నీ సంబంధిత సమస్యలు, ముఖ్యంగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు గుర్తించినట్లు ఆమె తెలిపారు. గ్రామంతోపాటు మరికొన్ని గ్రామాల ప్రజలు కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీటిని తాగడం లేదని, ఆరోగ్య సమస్యలను నివారించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటిని శుద్ధి చేసి గ్రామానికి అందించడం మంచి ఆలోచన అన్నారు. రసాయనాలతో కలుషితమైన నీటిని వాడకుండా శుద్ధి చేసిన నీటినే తాగాలని గ్రామస్తులకు సూచించారు. ఈ ప్రాజెక్టును విజయవంతం చేయాలని, తద్వారా ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులను తీసుకురావడానికి అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు. ప్రాజెక్టును అన్ని గ్రామాలకు విస్తరించే బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దితే కేంద్ర ప్రభుత్వం రూ.కోటి వరకు నిధులతోపాటు అవార్డులు కూడా అందించే అవకాశం ఉందని, ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మట్, ఎస్పీ నితిక పంత్ కాంగ్రెస్ నాయకుడు శ్యాం నాయక్, ఎంసీ సుగుణక్క, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, గోయగం సర్పంచ్ ఆత్రం ఆనంద్ రావు, ఉప సర్పంచ్ మొహర్లే రాందాస్, పంచాయతీ కార్యదర్శి ఎం.మురళీధర్, నీతి ఆయోగ్ సమన్వయకర్త డాక్టర్ బాలరాజు, స్వయం సహాయక సంఘాల మహిళలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





