పంట రక్షణకు వేసిన విద్యుత్ తీగ ప్రాణాలు తీసింది

– విద్యుత్ షాక్‌తో దంపతుల మృతి
– గంభీరావుపేటలో విషాద ఘటన

సిరిసిల్ల/వేములవాడ రూరల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2:  కష్టపడి సాగు చేసుకుంటున్న పంటను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఆ దంపతులు చేసిన ప్రయత్నం వారి కుటుంబంలోనే తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ రూపంలో మృత్యువు కబళించడంతో భార్యాభర్తలు విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గంభీరావుపేటకు చెందిన గంట దేవయ్య (65), ఆయన భార్య గంట లక్ష్మి (58) దంపతులు పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. తమ జీవనాధారమైన పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో అడవి జంతువుల సంచారం ఎక్కువ కావడంతో పంటను రక్షించుకునేందుకు పొలం చుట్టూ స్టార్టర్ డబ్బా నుంచి విద్యుత్ తీగను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం దేవయ్య, లక్ష్మి దంపతులు పొలం వద్దకు వెళ్లారు. చీకటి పడిన తర్వాత ప్రమాదవశాత్తు ఆ విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. రాత్రి సమయంలో అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం పొలం వైపు వెళ్లిన గొల్ల నిశాంత్ అనే వ్యక్తి. దంపతులు ఇద్దరూ విద్యుత్ షాక్‌తో మృతి చెంది ఉండటాన్ని గమనించి వెంటనే వారి కుమార్తె గంధపు భాగ్యలక్ష్మికి సమాచారం అందించాడు. కుటుంబీకులు అక్కడికి చేరుకొని విగతజీవులుగా పడి ఉన్న త‌ల్లిండ్రుల‌ను చూసి గుండెల‌విసేలా రోదించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుమార్తె భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు గంభీరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. తమ తల్లిదండ్రుల మరణంపై ఎలాంటి అనుమానం లేదని, ప్రమాదవశాత్తే ఈ ఘటన జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *