– వడదెబ్బతో భూపాలపల్లిలో నలుగురు మృతి
వరంగల్, మే 22: రాష్ట్రంలో ఎండలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్ప్పుల కొలిమిలా మారింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతున్నాయి. భూపాలపల్లిలో వడదెబ్బతో ఒక్కరోజే నలుగురు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. రేగొండ మండలం భాగిర్తిపేటకు చెందిన యాకూబ్(45), మొగుళ్లపల్లి మండలం పోతుగల్లుకు చెందిన సక్కమ్మ(59), చిట్యాల మండలం చల్లగరిగేకు చెందిన పోషయ్య, కాటారం మండలం శంకరంపల్లికి చెందిన సమ్మక్క(65) వడదెబ్బ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 22 మంది వడదెబ్బతో మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తొమ్మిదిమంది వడదెబ్బతో మరణించారు. భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో అత్యవసర పనుల మీద బయటకు రావాలన్నా ప్రజలు భయపడుతున్నారు. తీవ్రమైన ఎండలతో చిన పిల్లలు, వృద్ధులు, బయట పనులు చేసే కార్మికులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





