డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో రాష్ట్రం రోల్ మోడల్

– పౌర సేవలు మరింత చేరువయ్యేలా కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్
– నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్‌ అనుసంధానానికి ‘ఎకో సిస్టం’
– డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పౌర సేవల్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటకే చేర్చేలా ఒక ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో హెచ్‌ఐసీసీలో శుక్రవారం నిర్వహించిన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్-2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీ ఊహించని వేగంతో డిజిటల్ వైపు దూసుకుపోతోందని, సంప్రదాయ పద్ధతుల స్థానంలో వ్యవస్థను రీ-డిఫైన్ చేసే సరికొత్త డిజిటల్ ఈక్వేషన్స్ తెరపైకి వచ్చాయని అన్నారు. ఈ గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు అనుగుణంగా మార్పుల్ని అందిపుచ్చుకునే దేశాలకే భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు. డిజిటల్ పేమెంట్స్ నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వరకు మనం సాధిస్తున్న పరివర్తనను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందన్నారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో భారత్ సాధిస్తున్న ప్రగతికి తెలంగాణ ఒక గ్రోత్ ఇంజన్‌లా మారిందన్నారు. భావితరాల అవసరాలకనుగుణంగా నెక్ట్స్ జనరేషన్ ఇన్నోవేషన్స్, టాలెంట్, ఎకనామిక్ గ్రోత్.. ఈ మూడింటినీ నడిపించే ఒక బలమైన ఎకోసిస్టంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో మన వాటాను 10 శాతానికి చేర్చాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. ఒకప్పుడు సంప్రదాయ బుక్ కీపింగ్, అకౌంట్స్ ఆడిటింగ్‌కే పరిమితమైన సీఏలు నేడు కార్పొరేట్ సంస్థలకు స్ట్రాటజిక్ బిజినెస్ అడ్వైజర్స్‌గా రూపాంతరం చెందారన్నారు. ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్ వల్ల ఫైనాన్స్ రంగంలో సరికొత్త అవకాశాలు, అదే స్థాయిలో సైబర్ మోసాలు, డీప్‌ఫేక్స్, సైబర్ అరెస్ట్, క్రిప్టో ఫ్రాడ్స్ తదితర సవాళ్లు కూడా తెరపైకి వచ్చాయన్నారు. ఈ తరుణంలో సీఏలు ఫైనాన్షియల్ ఆడిటింగ్‌కే పరిమితం కాకుండా సైబర్ అష్యూరెన్స్‌కూ ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందన్నారు. స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ పై దృష్టి సారించాలని సూచించారు. ఈ అంశంలో ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఅండ్‌ఏజీ ఆనంద్ మోహన్ బజాజ్, సెర్ట్-ఇన్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ సోలంకి, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్‌కంట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ రాజగోపాల్ శర్మ, సెబీ సీజీఎం సాహిల్ మాలిక్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్థన్, ఆర్బీఐ సీజీఎం శైలజారాణి జంపాల, ఎన్ఎస్‌ఈ సీఐఎస్వో రాజేష్ థాపర్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో వినాయక్ గాడ్సే తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *