తుపాకితో గాలిలోకి కాల్పులు

– బీఆర్‌ఎస్ నాయకుడిపై కేసు

నకిరేకల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : విజయదశమి రోజున శమీ పూజ సందర్భంగా తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపిన ఓ రాజకీయ నాయకుడికి పోలీసులు గట్టి షాకిచ్చారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో దసరా ఉత్సవాల సందర్భంగా జరిగిన తుపాకి కాల్పుల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని జమ్మి చెట్టు వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ నాయకుడు చింతల సోమయ్య పాల్గొన్నారు. తన వద్ద ఉన్న తుపాకితో గాలిలోకి కాల్పులు జరిపి తుపాకితో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని ప్రదర్శించడమే కాకుండా,ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా గాలిలోకి కాల్పులు జరిపినందుకు సోమయ్యపై కేసు నమోదు చేశారు. ఆయన వద్ద నుంచి ఒక తుపాకితోపాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారైనా సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

సోమయ్య మాజీ మావోయిస్టు

కాగా, సోమయ్య మాజీ మావోయిస్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే పోలీసులు ఆయనకు తుపాకీ లైసెన్స్ ఇచ్చినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన మొదట వేముల వీరేశంతో కలిసి పని చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఆయన ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్నట్టు సమాచారం. తుపాకిని చూపిస్తూ గ్రామంలోనూ పలువురిని బెదిరించడంతోపాటు భయభ్రాంతులకు గురిచేసినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆయన దసరా రోజు తుపాకితో గ్రామంలో కాల్పులు జరపడంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు నేరుగా నల్గొండ డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *