– 14 సెల్ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, స్టీల్ చేతి కడియం స్వాధీనం
ఇబ్రహీంపట్నం/మెట్పల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: జగిత్యాల జిల్లా బండలింగాపూర్ గ్రామంలో సైనికుడు తిగుర్ల స్వామిపై దాడి చేసిన కేసులో 14మంది నిందితులను అరెస్టు చేసినట్లు మెట్పల్లి సీఐ బి.సురేష్ బాబు, ఇబ్రహీంపట్నం ఎస్సై జి.నవీన్ కుమార్ తెలిపారు. ఈనెల 22న రాత్రి వెల్లుల్ల గ్రామానికి చెందిన వన్నెల వికాస్‌పై బండలింగాపూర్‌కు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వికాస్ స్నేహితులు సుమారు 30మంది ఒక గుంపుగా తమ ద్విచక్ర వాహనాలపై అర్ధరాత్రి దాటిన తర్వాత బండలింగాపూర్ వెళ్లారు. 23న తెల్లవారుజామున సుమారు ఒంటి గంట సమయంలో హనుమాన్ ఆలయం సమీపంలో బతుకమ్మ ఆడుతున్న వారి పక్కనుంచి యువకులు ద్విచక్ర వాహనాలపై వేగంగా, నిర్లక్ష్యంగా వెళ్లగా అక్కడ ఉన్న సైనికుడు తిగుర్ల స్వామి వీరిని ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నిందితులు ఆయనపై దాడి చేసి స్టీల్ చేతి కడియంతో ముఖంపై కొట్టడంతో స్వామికి తీవ్రంగా గాయమైందని పోలీసులు వివరించారు. బాధితుడు స్వామి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ, ఎసఐ తెలిపారు. 24న ఉదయం మేడిపల్లి శివారులోని ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్డు వద్ద వెల్లుల్ల గ్రామానికి చెందిన 14మంది నిందితులు బావు రమేష్, తుపాకుల స్వామి, బావు అఖిల్, లక్కంపల్లి కార్తీక్, మర్రి నీరజ్, లక్కంపల్లి కళ్యాణ్, ఐలేని వంశీ, కల్లూరి మహేష్, కల్లూరి వంశీ, కాంతి విశాల్, బొబ్బిలి నాగరాజ్, పోచంపల్లి సాయి, మంచాల పవన్, కల్లూరి రవిలను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి నుంచి 14 సెల్ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, ఒక స్టీల్ చేతి కడియాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు.మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని వివరించారు.
యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఐ సురేష్‌బాబు, ఎసఐ నవీన్ కుమార్ సూచించారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో పిల్లలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, చెడు స్నేహాలకు దూరంగా ఉంచాలని సూచించారు. యువకులు గుంపులుగా ఏర్పడి గొడవలకు, దాడులకు పాల్పడటం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సహించబోమని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలతోపాటు భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు, పాస్‌పోర్టు వెరిఫికేషన్ వంటి ప్రక్రియలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




