రైతుల‌ను గౌర‌వించాలి

– ఒక రైతు అనుభవాలను ఇతర రైతులు స్వీకరిస్తారు
– శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌ల‌కంటే రైతు స‌ల‌హాలే గొప్ప‌వి
– రైతుల్ని సన్మానించడమంటే మనల్ని మ‌నం సన్మానించుకున్నట్లే
– రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు
– ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం భయపెడుతోంది
– కిసాన్ మహరాజ్ అవార్డుల కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : ఉత్తమ రైతులను గుర్తించడం, వారిని గౌరవించడం, వారి అనుభవాలను ఇతర రైతులకు తెలియజేయడం చాలా అవసరం అని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయ‌కుడు హరీష్ రావు అన్నారు. ఒక రైతు తన అనుభవంతో మంచి పంట పండించి లాభాలు పొందుతున్నప్పుడు పక్కనున్న రైతులు కూడా ఆ పద్ధతులను చాలా సులభంగా స్వీకరిస్తారన్నారు. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరందరూ ఒక్కొక్కరు ఒక్కో పంటలో అద్భుతమైన ప్రతిభను కనబరిచి ఉత్తమ రైతులుగా ఈ అవార్డులు అందుకోబోతున్నారంటూ అభినందించారు. శిల్ప కళా వేదికలో గురువారం నిర్వహించిన కిసాన్ మహరాజ్ అవార్డ్స్ కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి ఆయ‌న  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హ‌రీష్‌రావు మాట్లాడుతూ ఈరోజు ఒక సైంటిస్ట్ చెప్పినా, ఒక వ్యవసాయ శాఖ అధికారి  చెప్పినా కొన్నిసార్లు రైతులు అంత త్వరగా కొత్త పద్ధతులను స్వీకరించకపోవచ్చు.. కానీ పక్క గ్రామంలో ఒక రైతు అద్భుతంగా పంట పండించి మంచి లాభాలు పొందుతున్నాడంటే ఆయ‌న‌ను చూసి మిగతా రైతులు చాలా త్వరగా నేర్చుకుంటారంటూ తన అనుభవాన్ని వివరించారు. తమ ప్రాంతంలో రైతులకు ఆయిల్ పామ్ మొక్కలు పెట్టాలని తను చాలా ప్రోత్సహించాను.. మన ప్రాంతం కూడా ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా మారిందని, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత చెరువులు, చెక్‌డ్యామ్‌లలో నీరు చేరడం వల్ల వాతావరణంలో తేమ పెరిగిందని, ఆయిల్ పామ్ సాగు చేయాలని రైతులకు సూచించాను.. మొదట్లో చాలామంది తటపటాయించారు.. కానీ కొంతమంది రైతులు ముందుకొచ్చి ఆయిల్ పామ్ సాగు ప్రారంభించారు.. ఇప్పుడు ఆ రైతులకు పంట రావడం మొదలైంది.. వారు ఫలితాలు పొందడం చూసిన తర్వాత మిగతా రైతులు కూడా ఆయిల్ పామ్ సాగుకు ముందుకొస్తున్నారని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే రైతులందరూ మాకు ఆయిల్ పామ్ మొక్కలు కావాలి.. తాము కూడా ఆయిల్ పామ్ సాగు చేస్తామని అడుగుతున్నారు.. అయితే మొక్కలు దొరకని పరిస్థితి కూడా ఏర్పడిందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తమ రైతులందరినీ గుర్తించి, వారిని సన్మానించాలనే గొప్ప సంకల్పంతో ఈ కిసాన్ మహారాజా అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహక బృందానికి హరీష్ రావు అభినందనలు తెలిపారు. సాధారణంగా సినిమా యాక్టర్లను, రాజకీయ నాయకులను, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన ప్రముఖులను సత్కరిస్తుంటారు.. కానీ రైతుల విషయానికి వచ్చేసరికి ఎందుకో చాలా తక్కువ సంస్థలు ముందుకొస్తుంటాయన్నారు. అయితే ఈరోజు ఈ కిసాన్ మహారాజా అవార్డ్స్ కార్యక్రమాన్ని వైజ్ టీవీ చక్కగా ఏర్పాటు చేసిందని ప్రశంసించారు. ఏదో ఒక చిన్న హాల్లో కార్యక్రమం నిర్వహించకుండా ఆ పేరుకు తగ్గట్టుగా రైతులను అత్యంత ఘనంగా సన్మానించాలనే మంచి ఆలోచనతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని కొనియాడారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి అవార్డులు అందుకోబోతున్న రైతు సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. సమాజంలో రైతుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదు అంటారు. అది మాటల్లోనే కాదు.. ఈరోజు రైతు లేకపోతే ఈ దేశానికి అన్నం లేదు.. ఇంత పెద్ద జనాభాకు, ఇన్ని కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందించడానికి ఆరుగాలం కష్టపడి, ఎండనక, వాననక, చలినక, రేయింబవళ్లు శ్రమించి మీరు పండించే పంటలే ఈ దేశ ప్రజల ఆకలిని తీరుస్తున్నాయి అని చెప్పారు. ఈరోజు అనేక‌మంది  రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను, కొత్త మెళకువలు నేర్చుకొని ప్రభుత్వ సహకారం ఉన్నా లేకపోయినా అద్భుతంగా పంటలు పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రైతును సన్మానించుకోవడం అంటే మనల్ని మనమే సన్మానించుకోవడమే.. ఎందుకంటే రైతే ఈ దేశానికి వెన్నెముక అని చెప్పారు. మీరు చేస్తున్న మంచి వ్యవసాయ కార్యక్రమాలు పదిమందికి ఆదర్శంగా నిలవాల‌ని ఆకాంక్షించారు.
నేడు మన రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి నెలకొంది.ఇప్పుడు ఎల్‌నినో ప్రభావం వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత, పంటలు ఎండిపోవడం వంటి సమస్యల గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలి.కానీ దురదృష్టవశాత్తు రేవంత్ ప్రభుత్వం కూడా భయపడుతున్నది.తాగడానికి నీళ్లు ఉండవు, పశువులు చనిపోతాయి, మనుషులు ఇబ్బందులు పడతారు, పంటలు ఎండిపోతాయి అని భయపెట్టడం ఒక ప్రభుత్వం చేయాల్సిన పని కాదు.ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజలకు ధైర్యం ఇవ్వాలి. భరోసా ఇవ్వాలి. సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలి.కానీ మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు ఉన్న నీళ్లను కూడా ఎత్తిపోసుకోలేకపోతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన ఆ 25 లక్షల మంది రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది?వారికి ఎలాంటి సహాయం అందిస్తుంది?పంట నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తుంది?రైతులకు ఎక్స్‌గ్రేషియా ఎలా అందిస్తుంది?ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.పక్కన మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రైతులకు ఏ విధంగా సహాయం అందించాలి, ఎలాంటి పరిహారం ఇవ్వాలి అనే అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు, మన రాష్ట్రంలోని రైతులకు కూడా స్పష్టమైన భరోసా ఇవ్వాలి.కేసీఆర్ ఎంతో గొప్ప ఆలోచనతో రైతు బంధు పథకం తెచ్చారు.కానీ దురదృష్టమేంటంటే, ఇంకా మెరుగ్గా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తలేరు, రైతుబీమా ఆగిపోయింది, 24 గంటల విద్యుత్ కాస్తా ఆరేడు గంటలకు తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మార్పు, మార్పు అని చెప్పారు. కానీ ఈ రకమైన మార్పు రావడం గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవార్డు గ్రహీతలు ఇంకా ఇంకా ఎదగాలి. వ్యవసాయంలో మరిన్ని విజయాలు సాధించాలి. ఇతర రైతులకు ఆదర్శంగా నిలవాలి.ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. లాయర్ కొడుకు లాయర్ అవుతున్నాడు. యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్నాడు. లీడర్ కొడుకు లీడర్ అవుతున్నాడు.కానీ రైతు కొడుకు మాత్రం రైతు కావాలని ఆ రైతు కోరుకోలేని పరిస్థితి ఉంది.ఆ పరిస్థితి మారాలి.రైతు తన కొడుకును చూసి, నువ్వు కూడా రైతు కావాలి అని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలి.రైతు బిడ్డ కూడా “నేను రైతునవుతాను. వ్యవసాయం చేస్తాను. ఈ దేశానికి అన్నం పెడతాను” అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలి.ఆ రోజు వచ్చినప్పుడే నిజంగా రైతును రాజును చేసినట్లు.ఆ రోజు వచ్చినప్పుడే రైతుల జీవితాల్లో నిజమైన వెలుగులు వచ్చినట్లు.ఆ రోజు వచ్చినప్పుడే వ్యవసాయానికి సమాజంలో రావాల్సిన గౌరవం వచ్చినట్లు.అలాంటి రోజు కోసం మనందరం కలిసి పనిచేయాలి. రైతు కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలి. వ్యవసాయం ఒక గౌరవప్రదమైన, లాభసాటైన వృత్తిగా నిలవాలి.రైతులకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మళ్లీ వ్యవసాయ రంగంలో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. రైతు రాజుగా నిలబడే రోజులు కూడా తప్పకుండా వస్తాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను.ఈరోజు ఇలాంటి కరువు పరిస్థితుల్లో, ఎల్‌నినో ప్రభావంతో ఎదురవుతున్న ఇబ్బందుల్లో రైతులెవరూ ధైర్యాన్ని కోల్పోవద్దని కోరుకుంటున్నాను.రైతు సోదరులారా, సోదరీమణులారా! మీరు ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కష్టాలు శాశ్వతం కాదు. మంచి రోజులు తప్పకుండా వస్తాయి.మీ అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, మీ పంటలు సమృద్ధిగా పండాలని, మీ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని హ‌రీష్ రావు అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *