శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి చెరువులోకి దూకి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన రాజేష్ (25) నగరంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. నాచారం ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. కాగా, సోమవారం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉంటున్న తన స్నేహితులను కలిసేందుకు తెల్లవారుజామునే రాజేష్ అక్కడికి వెళ్లాడు. స్నేహితులను కలిసిన అనంతరం సాయంత్రం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లిన రాజేష్ బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్లి అకస్మాత్తుగా చెరువు లోకి దూకేశాడు. ఈ దృశ్యాన్ని గమనించిన తోటి పర్యాటకులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాజేష్ మృతదేహాన్ని వెలికితీసేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. బోట్ల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాజేష్ తీసుకున్న ఈ నిర్ణయానికి గల కారణాలు తెలియరాలేదు. రాజేష్ సోదరి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుడి ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




