గొర్రెల షెడ్డులో అగ్ని ప్రమాదం..300 గొర్రెలు సజీవ దహనం

ఖిలా వరంగల్ లో ఘటన
  ఖిలా వరంగల్లో విషాద ఘటన జరిగింది. అర్ధ రాత్రి గొర్రెల షెడ్డు లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 300 గొర్రెలు సజీవ దహనమయ్యాయి.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే గొర్రెలు చనిపోయాయి.   షార్ట్ సర్క్యూటా?, ఎవరైనా కావాలని తగలబెట్టారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఖిలా వరంగల్‌లోని మట్టికోట పక్కనే దుగ్గిరాల లక్ష్మణ్ అనే వ్యక్తి గొర్రెల పెంపకం చేస్తున్నాడు. ఒక షెడ్డు వేసి అందులో గొర్రెలను పెంచుతూ వాటి పాలు, ఎరువులు, గొర్రెల విక్రయాల ద్వారా జీవనోపాధి పొందుతున్నాడు. షెడ్డులో 300లకు పైగా గొర్రెలు ఉన్నాయి. కాగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు షెడ్డుకు నిప్పు పెట్టినట్లు బాధితుడు ఆరోపించాడు ఒక్కసారిగా మంటలు చెలరేగి షెడ్డు మొత్తం మంటల్లో చిక్కుకుంది.  ఈ మంటల్లో షెడ్డులోని గొర్రెలు సజీవ దహనమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వొచ్చి మంటలు ఆర్పే లోపే షెడ్డులోని గొర్రెలు మొత్తం మృతి చెందాయి. వీటి పెంపకం ద్వారా జీవనోపాధి చెందుతున్న లక్ష్మణ్ కుటుంబం బోరున విలపించింది. ఎవరో గుర్తుతెలియని దుండగులు పగతో ఈ దారుణానికి ఒడిగట్టారని రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా.? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *