– వినాయక నిమజ్జనం సమస్యను పరిష్కరించాలి
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పెంచాలని డిమాండ్ చేస్తున్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పదాధికారులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉత్సవ సమితి సభ్యులను అరెస్టు చేయడం దుర్గార్గమన్నారు. భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణ మొదలుకుని నిమజ్జనం వరకు క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి 47 ఏళ్లుగా కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి, పోలీసులకు, వివిధ శాఖలకు సహకరిస్తూ లక్షలాది మంది భక్తులు పాల్గొనే నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పనిచేస్తోందన్నారు. ఈసారి కూడా నగరవ్యాప్తంగా దాదాపు 1,40,000 గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించారని తెలిపారు. ఈనెల 25న జరిగే ప్రధాన నిమజ్జనోత్సవానికి లక్షలా మంది భక్తులు తరలివస్తారని, ఇంతటి భారీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వం చాలా ముందుగానే స్పష్టత ఇవ్వాల్సి ఉందని అన్నారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి సంబంధించిన అంశాన్ని గణేశ్ ఉత్సవ సమితి ముందుగానే ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లిందని, అయినా ప్రభుత్వం సరైన సమయంలో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపడంలో విఫలమైందని విమర్శించారు. న్యాయపరమైన అంశాలు ఉన్నప్పుడు వాటిని ముందుగానే పరిశీలించి చట్టపరిధిలో ఏం చేయవచ్చో నిర్ణయించి, ఉత్సవ సమితితో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కానీ నిమజ్జనోత్సవానికి కొద్ది రోజుల ముందు ఆంక్షలు విధించడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. పెద్ద సంఖ్యలో, భారీ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన క్రేన్లు, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. భక్తుల మనోభావాలను గౌరవించాలని, ఉత్సవ సమితితో ఘర్షణకు దిగడం, అరెస్టులతో సమస్యను అణచివేయాలని చూడడం సరైన విధానం కాదని హితవు పలికారు. ప్రభుత్వం పరిస్థితిని జఠిలం చేసేలా వ్యవహరించకూడదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే భక్తుల మనోభావాలను గౌరవిస్తూ భారీ విగ్రహాల నిమజ్జనానికి ఆచరణాత్మకమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా, సజావుగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తయ్యేలా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





