– విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నవీన్ నాయక్
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం
భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: అడవిని కాపాడే బాధ్యత భుజాన వేసుకున్న ఓ యువ ఉద్యోగి.. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు బలయ్యాడు. అడవిలో అక్రమ వేటను అడ్డుకునేందుకు వెళ్లిన ఆయనకు అదే అడవి ప్రాణాంతకంగా మారింది. రెప్పపాటులో విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయిన బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ నాయక్ మృతి అటవీశాఖను, ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. బూర్గంపాడు మండ లం చెరువు సింగారం బీట్ పరిధిలో తోటి సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మూగజీవుల వేట కోసం వేటగాళ్లు అమర్చినట్లు భావిస్తున్న విద్యుత్ తీగ తగలడంతో నవీన్ ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గుర య్యారు. క్షణాల్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పక్కనే ఉన్న సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను భద్రాచలం ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందారు. నవీన్కు భార్యతో పాటు ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. తండ్రి ఆకస్మిక మృతి కుటుంబ సభ్యులను కన్నీటి పర్యంతం చేసింది. తండ్రి ఇక తిరిగిరాడన్న నిజం కూడా తెలియని వయసులో ఆ చిన్నారులు పడుతున్న వేదన చూపరుల హృదయాలను కలచివేసింది.
మంత్రి సీతక్క సంతాపం
హైదరాబాద్: వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతిచెందడం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వన్యప్రాణులను కాపాడేందుకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నవీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలు, ఉచ్చులు ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల జంతువులతోపాటు అటవీ సిబ్బంది, స్థానిక ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల వేటకు పాల్పడవద్దని, ప్రాణాంతకమైన విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేయవద్దని మంత్రి సీతక్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



