– ప్రొబేషనరీ డీఎస్పీలకు డీజీపీ ఆనంద్ దిశానిర్దేశం
– 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో గంటన్నరపాటు ముఖాముఖి
– రోజుకు కనీసం గంట క్రీడలు లేదా వ్యాయామానికి కేటాయించాలి
– 5వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విజేతలకు పతకాలు అందజేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 30: పోలీస్ అధికారుల కెరీర్‌కు శిక్షణే పునాది అని తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ అన్నారు. సమర్థవంతమైన పోలీస్ అధికారులుగా ఎదగాలంటే క్రమశిక్షణ, నిబద్ధత, నాయకత్వ లక్షణాలతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో డీజీపీ బుధవారం ముఖాముఖి నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు సాగిన ఈ కార్యక్రమంలో పోలీస్ నాయకత్వం, బాధ్యతలు, నైతికత, ప్రజలతో వ్యవహరించే తీరు తదితర అంశాలపై ఆయన విస్తృతంగా మాట్లాడారు.పదవిలో ఉన్నంత మాత్రాన నాయకత్వం రాదని, నాయకుడికి ప్రత్యేకమైన లక్షణాలు అవసరమని డీజీపీ పేర్కొన్నారు. ధైర్యం, స్పష్టమైన దార్శనికత, సమగ్రత, విలువలు–నైతికత, బృంద స్ఫూర్తి, నిష్పక్షపాత వైఖరి, సమర్థమైన కమ్యూనికేషన్, కష్టపడి పనిచేసే తత్వం, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతతో పాటు వినయం ముఖ్యమైన నాయకత్వ లక్షణాలని వివరించారు.ముఖ్యంగా నైతిక విలువలపై యువ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విధి నిర్వహణలో చేసే చిన్న పొరపాట్లు కూడా భవిష్యత్తులో వారి ప్రతిష్ఠపై ప్రభావం చూపుతాయని చెప్పారు. పోలీస్ సర్వీసులో మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ ఉండే నేపథ్యంలో తమ ప్రతిష్ఠను కాపాడుకోవడం ప్రతి అధికారికి అత్యంత కీలకమని అన్నారు.శిక్షణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై ప్రొబేషనర్లు అవగాహన పెంచుకోవాలని డీజీపీ సూచించారు. ప్రజలతో వ్యవహరించడం, నేరాల దర్యాప్తు, చట్టాల అమలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో వినియోగించడం వంటి అంశాల్లో సమగ్ర నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. చట్టాలపై పరిజ్ఞానం మాత్రమే మంచి పోలీస్ అధికారిగా తీర్చిదిద్దదని, నాయకత్వం, మానవీయ దృక్పథం, దర్యాప్తు నైపుణ్యం, సాంకేతిక అవగాహన, శారీరక దృఢత్వం, ప్రజలతో సమర్థమైన కమ్యూనికేషన్ కూడా అవసరమని పేర్కొన్నారు. “ప్రజలకు భద్రత కల్పించడం, వారికి సకాలంలో న్యాయం అందేలా చూడటమే పోలీసింగ్ అంతిమ లక్ష్యం” అని డీజీపీ అన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ మాట్లాడుతూ.. ప్రొబేషనరీ డీఎస్పీల ప్రొఫెషనల్ కోర్సులో 74 మంది పురుషులు, 38 మంది మహిళలు కలిపి మొత్తం 112 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సుమారు 10 నెలలపాటు జరిగే కోర్సులో ఇండోర్, అవుట్‌డోర్ శిక్షణకు సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.
క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులపై ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా కాంబాట్ వ్యాయామాలు, గుర్రపు స్వారీ, ఈత, వివిధ రకాల ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్–సీలో విజేతలకు డీజీపీ పతకాలు, బహుమతులు అందజేశారు. సెప్టెంబరు 28న ప్రారంభమైన మూడు రోజుల పోటీలు బుధవారం ముగిశాయి. బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ పోటీల్లో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారుల వరకు 700 మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.పోలీసులు ఒత్తిడితో కూడిన విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని డీజీపీ అన్నారు. ప్రతి పోలీస్ అధికారి రోజుకు కనీసం గంటపాటు క్రీడలు లేదా శారీరక వ్యాయామానికి కేటాయించాలని సూచించారు.పోలీస్ క్రీడలను గతంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించేవారని, ప్రస్తుతం క్లస్టర్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎక్కువమంది పోలీస్ క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. క్లస్టర్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి వారికి మరింత పోటీ అనుభవం కల్పించడం ద్వారా ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌బీవీఆర్‌ఆర్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఐజీపీ (పి&ఎల్) గజరావు భూపాల్, డిప్యూటీ డైరెక్టర్లు చేతన, మురళీధర్, ఇతర సీనియర్ అధికారులు, అకాడమీ సిబ్బంది, ట్రైనీ ప్రొబేషనరీ డీఎస్పీలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





