– ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి సీతక్కల సంతాపం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి(88) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం ఎంబీ భవన్‌కు ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం వరకు అక్కడ ఉంచనున్నారు. మల్లారెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట. ఆయన దశాబ్దాలుగా రైతు సమస్యలపై పోరాడుతున్నారు. అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు నాయకుడు, కమ్యూనిస్టు నేత సారంపల్లి మల్లారెడ్డి మరణించారని తెలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైతుల హక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం ముందుండి అనేక ఉద్యమాలు నడిపించారని గుర్తు చేశారు. రైతు సంఘం నేతగా, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. భూమి హక్కులు, సాగునీరు, వ్యవసాయ రుణాలు, విత్తనాలు వంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన విస్తృత అంశాలపై నిరంతరం కృషి చేస్తూ జీవితాన్ని రైతుల సంక్షేమం కోసం అంకితం చేసిన నాయకుడు మల్లారెడ్డి అని కొనియాడారు. సారంపల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రైతాంగం కోసం అంకితమైన నేత సారంపల్లి : మంత్రి సీతక్క
సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదల హక్కుల కోసం దశాబ్దాలుగా ఆయన సాగించిన పోరాటం, రైతాంగ ఉద్యమానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. సారంపల్లి మృతి రైతాంగ ఉద్యమానికి తీరని లోటని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు, సహచరులకు, అభిమానులకు మంత్రి సీతక్క తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్