– బీజేపీ ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’
– రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు 48 గంటల దీక్ష ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తూ, విద్యావ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరులకు నిరసనగా బీజేపీ పోరుబాట పట్టింది. రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఫీజుల బకాయి- బీజేపీ లడాయి’ పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ప్రారంభమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే రామచందర్ రావు దీక్షకు దిగారు. ఫీజు బకాయిల సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ పోరాటం ఆగదని పార్టీ స్పష్టం చేసింది. కార్యక్రమానికి విద్యార్థులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరాటం కొనసాగుతోందన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో కాలేజీలకు వెళ్లి ఐదు లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించామని, ‘మా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మాకివ్వండి’ అంటూ విద్యార్థులు సంతకాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. ఫీజు బకాయిల కోసం విద్యార్థులు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తే వారిపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకá ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్కటే కాదు.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యాశాఖను నిర్వహిస్తున్నప్పటికీ విద్యా వ్యవస్థను గాలికొదిలేశారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి రూ.1,000 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించి ఇప్పటివరకు రూ.1,000 కూడా ఇవ్వలేదన్నారు. గత బీఆరఎస్ ప్రభుత్వం దాదాపు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్లు చేర్చిందని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయని, విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని తెలిపారు. యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో వచ్చే ఏడాదికి అడ్వాన్స్‌గా రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పిన సర్కారు ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల కోసం పోరాడితే వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడమేగాక దురుసుగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్, హోమియోపతి విద్యార్థులు స్టైఫండ్ల కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాహుల్ గాంధీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి ఇక్కడి విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు.. స్కాలర్షిప్లు ఎందుకు అందడం లేదో రాహుల్ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీ రేఖా శర్మ, బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతం రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి అండ్ మీడియా ఇన్చార్జి ఎన్.వి.సుభాష్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, రాష్ట్ర అధికార ప్రతినిధులు, పార్టీ పదాధికారులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్