హైదరాబాద్‌లో ఫేక్ కాల్ సెంటర్ స్కామ్

– కోట్ల రూపాయల సైబర్ మోసం
– కీలక నిందితుడు వికాస్ అరెస్ట్‌ 

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్ కేంద్రంగా నడిచిన అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ స్కామ్‌లో కీలక నిందితుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి వికాస్ కుమార్ నిమార్ అలియాస్ మిస్టీ అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల సైబర్ మోసానికి పాల్పడ్డాడు. దీంతో వికాస్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఫేక్ కాల్ సెంటర్‌కు సంబంధించి మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇంటర్‌పోల్ ద్వారా అమెరికా ఎంబసీ అందించిన సమాచారంతో సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసింది. 2023లో ఈసీఐఆర్ నమోదు చేసి మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్, విశాఖపట్నం, లఖ్‌నవూతోపాటు పలు నగరాల్లో నకిలీ కాల్ సెంటర్లను వికాస్ నిర్వహించాడు. ఈ ముఠా టెక్నికల్ సపోర్ట్ పేరుతో విదేశీయులను నమ్మించి భారీ మొత్తంలో డబ్బు కాజేసింది. ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ పైవేట్ కంపెనీల అధికారులమంటూ బాధితులకు ఫోన్ కాల్స్ చేసి నిందితుడు బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. వికాస్ కంప్యూటర్ వైరస్‌లు, బ్యాంకు ఖాతా సమస్యలు, సెక్యూరిటీ అలర్ట్‌ల పేరుతో అమెరికన్లను భయపెట్టి డబ్బు వసూలు చేశాడని, గిప్ట్ కార్డులు, డిజిటల్ పేమెంట్ల రూపంలోనూ బాధితుల నుంచి నగదు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి ఆధారాలు లేకుండా ప్రయత్నించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. క్రిప్టో ఆస్తులను ఎక్స్ఛేంజిలు, హవాలా తరహా నగదు సెటిల్‌మెంట్ నెట్‌వర్క్‌లు, బ్యాంకింగ్ మార్గాల ద్వారా భారత కరెన్సీగా మార్చినట్లు విచారణలో బయటపడింది. వీసీ సొల్యూషన్స్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి మోసపూరిత డబ్బును చట్టబద్ధ ఆదాయంగా చూపించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. వీసీ సొల్యూషన్స్ బ్యాంకు ఖాతాల్లో భారీ నగదు డిపాజిట్లు, అనుమానాస్పద క్రెడిట్ లావాదేవీలను గుర్తించారు. కాల్ సెంటర్ ద్వారానే ఆదాయం వచ్చినట్లు విచారణలో నిమార్ అంగీకరించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. అయితే ఈ డబ్బును ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో కిరాణా వ్యాపారం, ఇతర వ్యాపారాల ఆదాయంగా వికాస్ చూపించాడని తెలిపారు. ఈ కేసులో మరికొందరి పాత్ర, నిధుల ప్రవాహం, క్రిఫ్టో లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *