కాంగ్రెస్, బీఆర్ఎస్ ల‌ అవినీతిని వెలికితీస్తాం

– లెక్కలు తేల్చి దోచుకున్న సొమ్ము వసూలు చేస్తాం
– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చందర్ రావు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 21 : కాంగ్రెస్, బీఆర్ఎస్ ల పాలన, అవినీతి, బీజేపీపై ఆ పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ‌చందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతుండటంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయన్నారు. బీజేపీలో పలువురు ప్రముఖులు చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, మేధావులు, విద్యావేత్తలు సహా వివిధ రంగాల ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న విద్యావంతులు, మేధావులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరుతున్నారని తెలిపారు.

ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ నిరసన, మెటా కార్యాలయంపై దాడికి ఖండ‌న‌

దిల్లీలోని ఏఐ సమ్మిట్‌లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనను ఆయన తీవ్రంగా ఖండించారు. దుస్తులు విప్పి నిరసన ప్రదర్శన చేయడం ద్వారా ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు.హైదరాబాద్‌లోని ప్రముఖ బహుళజాతి సాంకేతిక సంస్థ మెటా కార్యాలయంపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ కార్యాలయంలో విధ్వంసం సృష్టించడం, ఆస్తులను ధ్వంసం చేయడం, ఉద్యోగులను బెదిరించడం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమ సంస్థల చర్యలపై అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టపరంగా నిరసన తెలియజేయాలని హిత‌వు ప‌లికారు. ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తామని చెబుతూ మరోవైపు ఇలాంటి ఘటనలు జరుగుతుంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.‘‘ఒకవైపు తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి గ్లోబల్ సమ్మిట్‌లు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థల కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు.. ఉద్యోగులను బెదిరిస్తున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు కొత్త పెట్టుబడులు ఎలా వస్తాయి.. ప్రపంచవ్యాప్త కంపెనీలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవలి భారత్ సమ్మిట్‌ను ప్రస్తావిస్తూ దేశాన్ని అవమానించడానికి, కించపరచడానికి ఆ వేదికను ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బీజేపీ బలం పెరుగుతుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు భయం పట్టుకుంది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై రామ‌చందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ ముగ్గురు నిరంతరం బీజేపీనే లక్ష్యంగా చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. లో బీజేపీ బలపడకపోతే, బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరగకపోతే మీకు మా గురించి ఎందుకంత భయం.. నిరంతరం బీజేపీనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు అని నిలదీశారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా బలపడుతుండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు భయం పట్టుకుందన్నారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి, రాష్ట్రంలో పార్టీ బలపడకుండా చూడటానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తాం

రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. తప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాధనంలో ప్రతి పైసాకూ లెక్కలు అడుగుతాం. రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తాం. దోచుకున్న ప్రజాధనాన్ని తిరిగి వసూలు చేస్తాం. అవినీతికి పాల్పడిన వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్ర అప్పులు దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరాయని ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయం తక్కువగా ఉండగా, అప్పులు, ఖర్చులు పెరిగిపోతున్నాయని విమర్శించారు.రాష్ట్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ పాలన సాగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు రెండు పార్టీల పాలనను చూశారు. అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా నిలబెడతాం అని రామ‌చందర్ రావు స్పష్టం చేశారు.

విద్యారంగాన్ని, రైతులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

విద్యాసంస్థల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, ఫిజికల్ ట్రైనర్లుగా పనిచేస్తున్న వారి దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రామ‌చందర్ రావు డిమాండ్ చేశారు. వారి నియామకాలు చేపట్టాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, వేతనాలను పెంచాలని కోరారు. తాను గతంలో శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. అయినప్పటికీ గత, ప్రస్తుత ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తమ పంటను కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. దళారులు రైతులను దోచుకుంటున్నారని, రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *