ఊరు మలిచిన కళాకారులు..

  • కళకు మతం లేదు.. మానవీయతే అసలైన బంధం!
  • హిందూ పురాణ నాటకాలకు జీవం పోస్తున్న ముస్లిం కళాకారులు
  • బతుకుతెరువు కోసం పశుపోషణ, హమాలీ పని.. ప్రవృత్తిగా నాటక రంగం
  • మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న మామిడిపల్లి కళాకారులు ఉస్మాన్ భాయ్, షబ్బీర్ ఖాన్
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్ల, నవంబర్ 21:  తెలంగాణ గ్రామీణ సమాజంలో మనుషుల మధ్య అల్లుకున్న మానవీయ అనుబంధాలు, ఆత్మీయత‌లు తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఒకరినొకరు వరుసలు పెట్టి పిలుచుకునే ఆప్యాయతలు, కష్టసుఖాల్లో తోడుగా నిలిచే మానవీయత ఇక్కడి సామాజిక జీవనంలో అంతర్లీనంగా పెనవేసుకుపోయాయి. నేటి సమాజంలో మత విద్వేషాలు విషం చిమ్ముతూ మానవీయ విలువలను దెబ్బతీస్తున్న వేళ.. సమైక్యతా భావానికి (Religious Harmony) ఊతమిస్తూ, లౌకిక‌ విలువలను తమ జీవితాల్లో ఆచరిస్తూ ఇద్దరు గ్రామీణ కళాకారులు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. కళకు మతం లేదని, మనుషుల మధ్య ఆత్మీయతే అసలైన బంధమని తమ కళా ప్రదర్శనల ద్వారా చాటుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన ఉస్మాన్ భాయ్, మహమ్మద్ షబ్బీర్ ఖాన్ జీవిత నేపథ్యం ఎన్నో జీవిత సత్యాలను ఆవిష్కరిస్తోంది.
బతుకుతెరువు కోసం వేర్వేరు పనులు.. ప్రవృత్తిగా నాటక రంగం..
రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గ్రామీణ నాటక కళాకారులుగా ఉస్మాన్ భాయ్, మహమ్మద్ షబ్బీర్ ఖాన్ గురించి తెలిసినవారు కొద్దిమందే కావచ్చు. కానీ, వారు రంగస్థలంపై ప్రదర్శించే పాత్రలు, అభినయం అనేక ప్రాంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముస్లిం కుటుంబ నేపథ్యం నుంచి వొచ్చిన ఈ ఇద్దరు కళాకారులు హిందూ పురాణ నాటకాల్లోని అనేక పాత్రలకు జీవం పోస్తూ ప్రేక్షకుల ప్రశంసలందుకుంటున్నారు.
ఉస్మాన్ భాయ్ జీవన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆవుల పోషణ ఆయన జీవనాధారం. ప్రవృత్తి మాత్రం నాటక రంగం. కబేళాకు తరలుతున్న గోవులను ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి తీసుకొచ్చి పెంచిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఉస్మాన్ భాయ్ “ప్రజాతంత్ర” కు తెలిపారు. ఆవులు పశువుల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటూనే కళారంగంపై ఉన్న మక్కువతో నాటక ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. మరో కళాకారుడి మహమ్మద్ షబ్బీర్ ఖాన్ జీవనాధారం హమాలీ పని. గ్రామంలోని ఐకెపి సెంటర్లో హమాలీగా ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.శ్రమజీవిగా తన వృత్తిని కొనసాగిస్తూనే నాటక రంగాన్ని ప్రవృత్తిగా మలుచుకున్నారు. హిందూ పురాణ గాథల్లోని పాత్రలను అలవోకగా పోషిస్తూ తన నటనా ప్రతిభను చాటుతున్నారు.
మానవీయతే ముఖ్యం..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బుర్ర బాలయ్య, మామిడిపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ‘శ్రీరామ కళామండలి’ ద్వారా అనేక నాటకాలు ప్రదర్శించేవారు. సుమారు 20 సంవత్సరాల క్రితం మామిడిపల్లి గ్రామంలో నాటకం ప్రదర్శిస్తున్న సమయంలో, బాల్యంలోనే అదే గ్రామానికి చెందిన ఉస్మాన్, మహమ్మద్ షబ్బీర్‌ ఖాన్ ల ఆసక్తిని గమనించారు. వారికి చిన్నచిన్న పాత్రలు ఇస్తూ ప్రోత్సహించేవారు. అలా మొదలైన వారి కళా ప్రయాణం.. సుమారు ఎనిమిదేళ్లుగా పూర్తిస్థాయిలో నాటక రంగంతో పెనవేసుకుపోయింది. పురాణ ఇతిహాసాల మూలాలను తెలుసుకోవడమే కాకుండా, వాటిలోని పాత్రలకు ఇరువురు జీవం పోస్తూ వస్తున్నారు.

Mamidipalli

పుండరీకం నాటకంతో మొదలై..

 తొలుత పుండరీకం నాటకంతో మొదలై, ఇప్పటివరకు చిరుతల రామాయణం, భక్త పుండరీకం తదితర అనేక నాటకాల్లో వివిధ పాత్రలతో ఉస్మాన్ భాయ్, మహమ్మద్ షబ్బీర్ ఖాన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సుమారు ఎనిమిదేళ్లుగా నాటక రంగంలో కొనసాగుతున్నట్లు ఇరువురు ‘ప్రజాతంత్ర’తో తెలిపారు. ముఖ్యంగా పురాణాల్లోని అనేక పాత్రలకు మహిళల రూపంలోనూ ఇరువురు ప్రాణం పోశారు. మహమ్మద్ షబ్బీర్ ఖాన్ ఏకంగా చిరుతల రామాయణం నాటకంలో ఒక్కడే కైక, అక్షయుడు, లంకిని తదితర పాత్రల్లో కనిపించిన సందర్భాలు ఉన్నాయి.
జీవనోపాధి కోసం రోజంతా శ్రమించే ఈ ఇద్దరు కళాకారులు రంగస్థలంపైకి వచ్చేసరికి మరో ప్రపంచంలోకి అడుగుపెడతారు. పాత్ర ఏదైనా దాని ఔన్నత్యాన్ని అర్థం చేసుకుంటూ, సంభాషణలు, హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కళ పట్ల వారికున్న అంకితభావం, నిబద్ధత వారి ప్రదర్శనల్లో స్పష్టంగా కనిపిస్తాయి.ఆత్మీయతే అసలైన బంధం..
తెలంగాణ గ్రామీణ సమాజంలో కులాలు, మతాల ప్రాతిపదికన మనుషుల మధ్య విద్వేషాలకు తావులేని ఆత్మీయ సంబంధాలు ఎన్నో చోట్ల నేటికీ కొనసాగుతున్నాయి. ఒకరినొకరు వరుసలు పెట్టి పిలుచుకోవడం, పండుగలు, వేడుకల్లో కలిసి పాల్గొనడం, ఆపదలో ఒకరికొకరు అండగా నిలవడం వంటి సంప్రదాయాలు గ్రామీణ జీవనంలో భాగంగా ఉన్నాయి. ఈ ఆత్మీయ వాతావరణమే తమను ఎంతగానో ప్రభావితం చేసిందని ఉస్మాన్ భాయ్, మహమ్మద్ షబ్బీర్ ఖాన్ లు చెబుతున్నారు. మతం, కులం కంటే మనుషుల మధ్య ఉండే ప్రేమాభిమానాలకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు.

మామిడిపల్లి నుంచి సామరస్య సందేశం..
మారుమూల గ్రామమైన మామిడిపల్లి నుంచి తమ కళా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఉస్మాన్ భాయ్, మహమ్మద్ షబ్బీర్ ఖాన్ కేవలం నాటక కళాకారులుగానే కాకుండా సామాజిక సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. వారి జీవన విధానం, కళ పట్ల అంకితభావం, ఇతర మతాల పురాణ పాత్రలను గౌరవంతో పోషిస్తున్న తీరు నేటి సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తోంది. మతాల పేరుతో మనుషుల మధ్య దూరాలు పెంచే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో గ్రామీణ కళాకారులుగా వారు కొనసాగిస్తున్న కళా ప్రయాణం మనుషుల మధ్య ఉండాల్సిన ఆత్మీయతను గుర్తుచేస్తోంది. కళకు మతం లేదని, కళాకారుడి ప్రతిభకు కులమతాల హద్దులు ఉండవని తమ ఆచరణతో నిరూపిస్తున్నారు.
ఇలాంటి కళాకారులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంతో పాటు ప్రభుత్వంపైనా ఉంది. గ్రామీణ నాటక రంగాన్ని, తరతరాలుగా వస్తున్న కళా సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు ఉస్మాన్ భాయ్, మహమ్మద్ షబ్బీర్ ఖాన్ వంటి కళాకారులకు తగిన గుర్తింపు కల్పించాల్సిన అవసరం ఉంది. మామిడిపల్లి నుంచి వినిపిస్తున్న ఈ కళా స్వరం రాష్ట్రవ్యాప్తంగా మరెందరికో స్ఫూర్తి కావాలని ఆకాంక్షిస్తూ.. మానవీయ విలువలకు కళా రూపం ఇస్తున్న ఉస్మాన్ భాయ్, మహమ్మద్ షబ్బీర్ ఖాన్‌లను ‘ప్రజాతంత్ర’ అభినందిస్తోంది.

 ప్రజలు ఆదరిస్తున్నారు..

ఉస్మాన్ భాయ్, గ్రామీణ కళాకారుడు, మామిడిపల్లి, కోనరావుపేట మండలం.
ఎవరి మతాన్ని వారు అనుసరించవచ్చు. ఎవరి మతాన్ని వారు గౌరవించవచ్చు. కానీ, కళకు మతం ఉండదు. మానవీయత మాత్రం ఉంటుంది. ప్రజలు ఆత్మీయంగా మమ్మల్ని కళాకారులుగా గుర్తిస్తున్నారు. ప్రజల ఆదరణ మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.మానవీయతను మించిన మతమేముంది..
మహమ్మద్ షబ్బీర్ ఖాన్, గ్రామీణ కళాకారుడు

మానవీయతను మించిన మతమేముంటుంది? మొదట్లో మా నాటక ప్రదర్శనల పట్ల కొందరు అయిష్టతను వ్యక్తం చేశారు. కానీ, మాలోని కళను గుర్తించిన ఎంతోమంది మమ్మల్ని కళాకారులుగా ఆదరించారు. నాటక రంగం మమ్మల్ని ప్రజలకు పరిచయం చేసింది. ప్రజలు ఆలోచించాలి. కళను, కళాకారులను ఆదరించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *