– దిల్లీ వాణిజ్య మేలాలో తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ
-పెట్టుబడి సదస్సు వివరాలు, నమోదు కోసం పవిలియన్‌లో స్టాండీలు
దిల్లీ, నవంబరు 21 : పోచంపల్లి ఇక్కత్ నుంచి దేవరకొండ గిరిజన ఆభరణాల వరకు.. హైదరాబాద్ ముత్యాల నుంచి ఇప్పపూల లడ్డూల వరకు.. తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రత్యేకతలు దిల్లీలో ఒకేచోట కనిపిస్తున్నాయి. భారత్ మండపంలో జరుగుతున్న 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య మేలా (ఐఐటీఎఫ్)లో తెలంగాణ పవిలియన్‌లోని చేనేత వస్త్రాలు, హస్తకళలు, సంప్రదాయ ఆహార ఉత్పత్తులపై సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. గద్వాల, నారాయణపేట చీరలు, వరంగల్ చేనేత తివాచీలు, కలంకారీ ఉత్పత్తులు, హైదరాబాద్ లక్క గాజులు ఉన్నాయి. సంప్రదాయ ఇక్కత్ వస్త్రాలతో ఆధునిక శైలిలో తయారు చేసిన బ్యాగులతోపాటు రాష్ట్రంలోని చిన్న పరిశ్రమల ఉత్పత్తులనూ ప్రదర్శిస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఎంపిక చేసిన స్టాళ్లలో గిరిజన సంప్రదాయ ఆహార ఉత్పత్తులు, సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పపూల (మహువా) లడ్డూలు, చిరుధాన్యాల బిస్కెట్లు, ఇతర చిరుధాన్యాల చిరుతిండ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్‌లో చేతితో తయారు చేసిన సేంద్రియ అగరుబత్తులనూ మేలాకు తీసుకొచ్చారు.
కొనుగోలుదారులను నేరుగా కలిసే అవకాశం
భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ(ఐటీపీఓ) ఏటా నిర్వహించే ఈ మేలా దేశంలోని ప్రధాన వాణిజ్య ప్రదర్శనల్లో ఒకటి. ‘వికాస్ ఔర్ విరాసత్’ (అభివృద్ధి, వారసత్వం) ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఏడాది మేళాలో 11 దేశాల భాగస్వామ్యం ఉంది. 3,500 మందికి పైగా ప్రదర్శకులు పాల్గొంటున్నారు. స్థానికంగా ఉత్పత్తులు తయారు చేసే చేనేత కార్మికులకు, స్వయం సహాయక సంఘాలకు ఇతర ప్రాంతాల కొనుగోలుదారులను నేరుగా కలుసుకుని, కొత్త మార్కెట్లను అన్వేషించే అవకాశం ఈ మేలాతో లభిస్తోంది. ప్రదర్శన 27 వరకు కొనసాగుతుంది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మార్గదర్శకత్వంలో వాణిజ్య, ఎగుమతి ప్రోత్సాహక విభాగం చేతివృత్తుల కళాకారులు, చేనేత కార్మికులు, స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు స్టాళ్లు కేటాయించింది. తెలంగాణ పావిలియన్ నోడల్ అధికారి, వాణిజ్య, ఎగుమతి ప్రోత్సాహక విభాగం ఉప సంచాలకుడు సుధిన్ పాల్ ఏర్పాట్లను, రోజువారీ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.
క్యూఆర్ కోడ్‌తో సదస్సుకు నమోదు
పవిలియన్‌లో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 సమాచార, నమోదు స్టాండీలు కూడా సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డిసెంబరు 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే సదస్సు వివరాలను వాటిపై ఉంచారు. ఆసక్తి ఉన్నవారు స్టాండీపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





