– పేదల, సామాన్యుల, మహిళల, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
– గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
– రూ.37.13 కోట్ల అంచనాతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన
మహేశ్వరం, ప్రజాతంత్ర, నవంబర్ 21 : రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, సామాన్యులు, మహిళలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రజా ప్రభుత్వమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేస్తామని, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులు సైతం దరఖాస్తు చేసుకోవాలని, అర్హతలు పరిశీలించి వారికి కూడా పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన చేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి సీతక్క పలువురు లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. నియోజకవర్గానికి చేరుకున్న మంత్రి సీతక్కకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు పెన్షన్లు అందుతున్నాయని లబ్ధ్దదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎంతోకాలంగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత అందిస్తోందని, ప్రస్తుతం మంజూరు చేస్తున్న నూతన పెన్షన్లలో 70 శాతానికి పైగా మహిళలకు దక్కుతున్నాయని చెప్పారు. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఈ దఫాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు కలిపి 4.75 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 60 వేలకు పైగా పెన్షన్లు, మహేశ్వరం నియోజకవర్గంలో 4,822 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ మొత్తాన్ని జమ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పటికే 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, ఇంకా అర్హులు ఉంటే వారికి కూడా కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి మహిళా స్వయం సహాయక సంఘంలో చేరి ఆర్థికంగా బలోపేతం కావాలని, మహిళా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందని సూచించారు.
అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం
చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాజకీయాలకు వేదిక కాదంటూ పరస్పరం నినాదాలు చేస్తున్న పార్టీల కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, కోపాలు, తాపాలు, ఆవేశాలకు లోనుకాకుండా జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. నియోజకవర్గంలోని మొహబ్బత్నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. శ్రీశైలం హైవే పక్కన మొహబ్బత్నగర్ వద్ద మొత్తం 13 రోడ్ల నిర్మాణ పనులకు ఫౌండేషన్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు రూ.37.13 కోట్ల అంచనా వ్యయంతో 43.38 కి.మీ మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. మంత్రి సీతక్క శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మహేశ్వరం కాంగ్రెస్ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు పారిజాత రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, డీఆర్డీఓ శ్రీలత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





