˜నీటిని అక్రమంగా తరలించే యత్నం
˜చంద్రబాబు కుట్రలకు బిజేపీ వత్తాసు..చోద్యం చూస్తున్న సీఎం రేవంత్
˜సీఎం రేవంత్ కు బిజేపిని ప్రశ్నించే తెలివి లేదు..
˜మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు
సిద్దిపేట, ప్రజాతంత్ర, 5 : ఏపీ సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలేనని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే, తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీటిని తీసుకువెళ్తున్నాని, తెలంగాణ ఏపీ రెండు కళ్ల లాంటివని, రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని కోరుకుం టున్నానని అన్నారు. ఇవి పూర్తిగా సత్యదూరమైన వాస్తవాలను ఆయన నిన్న మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల, కేంద్రంలో ఉన్న బిజేపీ పక్ష పాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోంది.
రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని ఎదిరించే దైర్యం లేదు. చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. దిల్లీని చూస్తే రేవంత్ కు భయం, బాబు పట్ల గురుదక్షిణ. దీంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వను ఎండబెట్టి, సాగర్ కుడి కాల్వ నుంచి చంద్రబాబు నీళ్లు తీసుకుపోతున్నారు. ఇదేనా సమన్యాయం. కృష్ణా జలాల్లో ఏపీకి తాత్కాలికంగా కేటాయించిన వాటా ప్రకారం 512 టీఎంసీలు రావాలి. కానీ మీరు 655 టీఎంసీల నీరు వాడారు. తెలంగాణకు 343 టీఎంసీ రావాలి. కాని తెలంగాణకు 220 వొచ్చింది దిల్లీలో ఉన్న మీ పలుకుబడి ఉపయోగించి బిజేపీ, చంద్రబాబు తెలంగాణ నోరు కొట్టారు. నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి రోజుకు రెండు టీఎంసీలు తీసుకుపోతున్నారు. తెలంగాణకు సాగునీరు, తాగు నీరు లేకుండా చేస్తున్నారు. హైదరాబాద్ తాగునీరు, ఎడమ కాల్వ కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. మీరు దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, బీమా కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది.
తెలంగాణ విషయంలో మీది పక్షపాత ధోరణి
కృష్ణా జలాల్లో అన్యాయంగా నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసింది చంద్రబాబేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతే తప్పేంటి అంటున్నారు. కృష్ణా నది విషయంలోనూ అదే జరిగింది. పెన్నా బేసిన్ లో ప్రాజెక్టులు కట్టి నదీ పరీవాహక ప్రాంతం బయట కృష్ణా జలాలు వాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కొట్టారు. అత్యధిక ప్రాంతం తెలంగాణలో పారితే, ఎక్కువ వాటా లేకుండా అన్యాయం చేశారు. అందుకే తెలంగాణ ఉద్యమం పుట్టింది. గోదావరి జాలల విషయంలోనూ అదే పని చేస్తున్నారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీలను గోదావరి నుంచి పెన్నా బేసిన్ కు తరలించే యత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బచావత్ ట్రిబ్యునల్ గోదావరిలో 1480 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి కేటాయించింది. అప్పటి ప్రభుత్వ జీవోల ప్రకరామే 968 టీఎంసీ తెలంగాణకు కేటాయించారు. కానీ వాడకంలో ఎప్పుడూ 200 టీఎంసీలు దాటలేదు.
అందుకే కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరి నదిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో 240 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును, 47 టీఎంసీలతో సమ్మక్క సాగర్, 65 టీంఎంసీలతో సమ్మక్క సాగర్‌ను, 12 టీఎంసీలతో వార్దా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కానీ చంద్రబాబు సీఎం కాగానే ఒక్కో ప్రాజెక్టు డీపీఆర్ లు వాపస్ వొస్తున్నాయి. కేసీఆర్ శక్తి యుక్తులతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించారు సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, వార్దా, కాళేశ్వరం మూడో టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించి చివరి దశలో ఉంది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, చంద్రబాబు తన పలుకుబడి కేంద్రంలో ఉపయోగించి డీపీఆర్ లు వాపస్ వొచ్చేలా చేశారు. రేవంత్ రెడ్డికి బిజేపిని ప్రశ్నించే తెగువ లేదు, తెలివి లేదు. దిల్లీలో రేవంత్ రెడ్డిని జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే అవగాహన లేక ఐ యామ్ నాట్ రైట్ ద పర్సన్ అని పక్కకు తప్పుకున్నారు. ఈయన చంద్రబాబును ఎదురించి చంద్రబాబును ప్రాజెక్టులు సాధిస్తారా, అక్రమ ప్రాజెక్టులను ఆపగలుగుతారా? చంద్రబాబు దగ్గర పని చేసిన వారిని తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారులుగా నియమించాడు. తెలంగాణకు ఎలా న్యాయం జరుగుతుంది. కాళేశ్వరం మంచిది అన్నరు. కనీసం ఒక మాట నిజం చెప్పారు.
కానీ, నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అన్నడు. 13.06.2018 నాడు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖను విడుదల చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం పట్ల తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. కానీ కాళేశ్వరం అడ్డుకోలేదు అని మాట్లాడారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీలు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క కాళేశ్వరమే కాదు, వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కల్వకుర్తి నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసారు, పాలమూరు ఎత్తి పోతల, డిరడి ఎత్తిపోతల పథకాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు పాలమూరు, డిరడి, కాళేశ్వరం ప్రాజెక్టులను వ్యతిరేకించారు. కాళేశ్వరం అనేది తెలంగాణ లైఫ్ లైన్. 18.25లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.83లక్షల ఎకరాల స్థిరీకరణ. హైదరాబాద్ సహా, సగం తెలంగాణకు సాగు, తాగు నీరు అందించే ప్రాజెక్టు. దీన్ని వ్యతిరేకించడం అంటే తెలంగాణకు అన్యాయం చేయడమే. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు డజన్ల కొద్ది ఉత్తరాలు రాశాడు.
తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబు, జగన్ లది ఒకే బాట. నిజంగా తెలంగాణ మీద ప్రేమ నిజం అయితే సీతమ్మసాగర్, సమ్మక్క సాగర్, కాళేశ్వరం మూడో టీఎంసీ, వార్దా ప్రాజెక్టులు తెలంగాణకు అనుమతి ఇవ్వండి. ఏపీకి అభ్యంతరం లేదు అని కేంద్రానికి ఉత్తరం రాయండి. పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు, డిరడి ఎత్తి పోతల పథకాలకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాసి మీ సమన్యాయం నిరూపించండి. పాలమూరులో వేసిన ఎన్జిటి కేసు విత్ డ్రా చేసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎంతో ఆలోచించి 45 టీఎంసీలు పాలమూరు ఎత్తిపోతల కోసం నికర జలాలు కేటాయించి, కేంద్రానికి డీపీఆర్ పంపిపాం. సిడబ్ల్యుసి మాజీ చైర్మన్ బజాజ్ నేతృత్వంలో కమిటీ వేస్తే, చంద్రబాబు కిరికిరి పెట్టి, ఇవాల్టి వరకు రిపోర్టు బయటికి రానివ్వలేదు. చంద్రబాబు పలుకుబడి ఉపయోగించి బడ్జెట్ లో ఏపీకి డబ్బులు తెచ్చుకున్నారు. సమన్యాయం అయితే తెలంగాణకు బడ్జెట్ లో గుండు సున్నా ఎందుకు వొచ్చింది రేవంత్ రెడ్డికి చేతకాలేదు. 8 మంది బిజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు చేసిందేం లేదు కేసీఆర్ విశాఖ ఉక్కుకు మద్దతు తెలిపారు. ప్రైవేటీకరణ చేయొద్దని మాట్లాడారు.
మీరు కేంద్రంలో పలుకుబడి ఉపయోగించి విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయకుండా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నారు. మీ సమన్యాయం నిజమే అయితే ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద అమ్మ కుండా ఆపండి.. పోలవరం వలే, పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ సెమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మితే చోద్యం చూస్తున్నారు. చంద్రబాబుకు బిజేపీ వత్తాసు పలుకుతున్నది, రేవంత్ మాట్లాడడు, ఎంపీలు నోరు మెదపరు. అందుకే తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ గొంతు విప్పాల్సి వస్తున్నదని హరీష్ రావు అన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే తాము ఊరుకోబోమని, రేవంత్ రెడ్డి చేతగాని తనాన్ని ఎండగడతామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, కడవెరుగు రాజనర్సు, గుండు భూపేష్,మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మారెడ్డి రవీందర్ రెడ్డి, కాముని శ్రీనివాస్, జాప శ్రీకాంత్ రెడ్డి, కుంభాల ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





