– డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రతి పైసా, ప్రతి గింజా వసూలు
– నిజాయతీ మిల్లర్లకు పూర్తి రక్షణ
– దశాబ్ద కాలపు సీఎంఆర్‌పై ఆడిట్‌కు మంత్రి ఉత్తమ్ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవస్థపై గత పది నుంచి 12 సంవత్సరాల కార్యకలాపాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం సేకరణ నుంచి బియ్యం అప్పగింత వరకు జరిగిన ప్రతి లావాదేవీ, మిల్లర్ల వారీగా డిఫాల్ట్‌లు, పెండింగ్ బకాయిలు, రికవరీలు, విజిలెన్స్ దర్యాప్తులు, న్యాయపరమైన చర్యలు, అమలు వ్యవస్థలను క్షుణ్ణంగా సమీక్షించి భవిష్యత్తులో ఎలాంటి లోపాలకు తావు లేకుండా సమగ్ర సంస్కరణలు చేపట్టాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో గత దశాబ్ద కాలంగా జరిగిన ధాన్యం సేకరణ, సీఎంఆర్ బకాయిలు, ఎఫ్‌సీఐకి అప్పగించిన బియ్యం, జిల్లాల వారీగా, మిల్లర్ల వారీగా పెండింగ్ డిఫాల్ట్‌లు, రికవరీల పురోగతి, విజిలెన్స్ కేసులు, న్యాయపరమైన చర్యలను విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం శిక్షలు విధించడం మాత్రమే కాదని, ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ప్రభుత్వ ధాన్యాన్ని, ప్రభుత్వానికి రావలసిన ప్రతి రూపాయిని పూర్తిగా తిరిగి రాబట్టడమేనని స్పష్టం చేశారు. అధికారులు వివరించిన మేరకు పెండింగ్ బకాయిల్లో ఎక్కువ భాగం గత ప్రభుత్వాల కాలంలో పేరుకుపోయినవేనని, ప్రస్తుతం వాటి రికవరీకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. నగదు రూపంలో చెల్లింపులు, ధాన్యం తిరిగి అప్పగింత, నాణ్యమైన బియ్యం సరఫరా వంటి అన్ని మార్గాల ద్వారా గరిష్ఠ స్థాయిలో రికవరీలు సాధించే చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. డిఫాల్ట్ మిల్లర్లకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన పరిమిత గడువు కారణంగా ఇప్పటికే గణనీయమైన రికవరీలు జరిగాయని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రతి కేసుపై మిల్లరు వారీగా గడువు నిర్ధారించి ప్రత్యేక రికవరీ కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు.
ప్రతీ ధాన్యం గింజ వెనుక రైతు చెమట, ప్రజల సొమ్ము
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కింద కొనుగోలు చేసే ప్రతీ ధాన్యం గింజ వెనుక రైతు చెమటతోపాటు ప్రజల సొమ్ము ఉందన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం ఎంపిక చేసిన రైస్ మిల్లర్లకు అప్పగిస్తుందని, వారు ఒప్పందం ప్రకారం నిర్దేశిత పరిమాణం, నాణ్యతతో బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని గుర్తు చేశారు. మిల్లర్‌కు అప్పగించే ప్రతి బస్తా ధాన్యం ప్రభుత్వ ఆస్తి. అది ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తి. అందులో ఒక్క గింజ దారి మళ్లినా అది ప్రజలకు నష్టం. ప్రభుత్వానికి రావలసిన ఒక్క టన్ను బియ్యం తగ్గినా ప్రజా పంపిణీ వ్యవస్థ బలహీనపడుతుంది అని మంత్రి ఘాటుగా హెచ్చరించారు. రాష్ట్రంలోని అత్యధికమంది రైస్ మిల్లర్లు నిజాయతీగా ప్రభుత్వంతో కలిసి పనిచేశారని, కొద్దిమంది మాత్రమే బియ్యం అప్పగింతలో జాప్యం చేయడం, ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించడం, ఒప్పందాలను ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడ్డారని అన్నారు.
విజిలెన్స్ దాడులు కొనసాగుతాయి
ప్రభుత్వ ధాన్యంపై నిర్వహించిన తనిఖీలు, దాడులు, నమోదు చేసిన క్రిమినల్ కేసులు, రికవరీలు, న్యాయపరమైన చర్యలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ డి.ఎస్.చౌహాన్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలు సమగ్ర నివేదిక సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లుల్లో భౌతిక తనిఖీలు, స్టాక్‌ల ధ్రువీకరణ, స్టాక్ రిజిస్టర్ల పరిశీలన, కొనుగోలు రికార్డులతో సరిపోల్చడం, ప్రభుత్వ ధాన్యం లేదా బియ్యం అక్రమ మళ్లింపులపై లోతైన విచారణ కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. మోసం, ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం, నమ్మకద్రోహం వంటి నేరాలకు ఆధారాలు లభించిన ప్రతి సందర్భంలో క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు పదేపదే డిఫాల్ట్ చేస్తున్న మిల్లర్లపై బ్లాక్‌లిస్టింగ్ సహా కఠిన పరిపాలనా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
సీఎంఆర్ వ్యవస్థలో సమూల సంస్కరణలు
గత డిఫాల్ట్‌ల సమీక్షతోపాటు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సీఎంఆర్ నియంత్రణ ఉత్తర్వులను పూర్తిగా సవరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఒప్పంద నిబంధనలను మరింత కఠినతరం చేయడం, బ్యాంకు గ్యారంటీలను బలోపేతం చేయడం, డిఫాల్ట్‌లపై కఠిన శిక్షలు, అమలు వ్యవస్థను మరింత సమర్థవంతంగా రూపొందించడం వంటి అంశాలను కొత్త విధానంలో చేర్చనున్నారు. పెండింగ్ రికవరీలు, ఆస్తుల జప్తు, బ్యాంకు గ్యారంటీల అమలు, సివిల్, క్రిమినల్ కేసుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించి రికవరీలకు అడ్డంకిగా ఉన్న ప్రతి పరిపాలనా అవరోధాన్ని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. రైతు చెమటతో పండిన ప్రతి గింజను ప్రభుత్వం ప్రజల సొమ్ముతో కొనుగోలు చేస్తున్నందున ప్రతి గింజకు ప్రభుత్వం కాపలాదారు. ప్రజల ఆస్తిని కాపాడటంలో, ప్రభుత్వ బకాయిలను పూర్తిగా రాబట్టడంలో, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయటంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
సాంకేతికతతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ
భవిష్యత్తులో ఒక్క గింజ కూడా దారి మళ్లకుండా సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను ప్రవేశపెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. దీనిలో క్యూఆర్ కోడ్‌తో గన్నీ సంచులు, జీపీఎస్ ఆధారిత వాహన ట్రాకింగ్, జియో ట్యాగ్ తనిఖీలు, రియల్ టైమ్ స్టాక్ రీకన్సిలియేషన్, ప్రొక్యూర్‌మెంట్–మిల్లింగ్–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





