-పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలే లక్ష్యం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారి వ్యాపారాలకు పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలు, విధానపరమైన సహకారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (డబ్ల్యూఈఈసీ)ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 నేపథ్యంలో ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి తొలి సమావేశం సచివాలయంలో సోమవారం జరిగింది. మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అధ్యక్షతన, వి హబ్ సీఈవో సీత పల్లచోళ్ల కన్వీనర్‌గా పనిచేసే ఈ కౌన్సిల్లో విధాన నిర్ణేతలు, మహిళా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు భాగస్వాములవుతారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ స్వయం సహాయక సంఘాల నెట్‌వర్క్‌ల ద్వారా మహిళలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళలకు పెట్టుబడులు, మార్కెట్లు, అనుకూలమైన ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉండాలన్నారు. మహిళా పారిశ్రామికతను సంక్షేమ కోణంలో మాత్రమే చూడకూడదని, రాష్ట్ర ఆర్థిక బలాన్ని పెంచే కీలక రంగంగా గుర్తించాలని పేర్కొన్నారు. మహిళా వ్యాపారవేత్తలకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం వీ హబ్ ద్వారా కృషి చేస్తుందని తెలిపారు. పాలసీ, సంస్థాగత నాయకత్వం, పట్టణ ఆవిష్కరణలు, పారిశ్రామికీకరణ, సమ్మిళిత వ్యాపారాలు, పెట్టుబడులు, కార్పొరేట్ భాగస్వామ్యాలు అనే నాలుగు కీలక రంగాలపై కౌన్సిల్ దృష్టి సారిస్తుందన్నారు. సీత పల్లచోళ్ల మాట్లాడుతూ మహిళా వ్యాపారవేత్తలకు ఆశయాలు, సామర్థ్యాల కొరత లేదని, పెట్టుబడులు, వినియోగదారులు, మార్కెట్లు, వ్యాపార నెట్‌వర్క్‌లకు చేరువ కావడంలోనే ప్రధాన అడ్డంకులు ఉన్నాయని తెలిపారు. ఈ కౌన్సిల్ ద్వారా ఆ సమస్యలకు ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను గుర్తించి ప్రభుత్వ విధానాల ద్వారా అమలు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. కౌన్సిల్ సిఫారసులతో మహిళా పారిశ్రామిక రంగంపై ప్రత్యేక శ్వేతపత్రాన్ని గ్లోబల్ సమ్మిట్‌లో విడుదల చేయనున్నారు. వీ హబ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ సంబంధిత శాఖల సమన్వయంతో సిఫారసుల అమలుకు తోడ్పడనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





