– ఆర్థిక ప్రగతి కేంద్రాలుగా జిల్లాలను తీర్చిదిద్దుతాం
– మెగా ఎఫ్‌టీఏ అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌లో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : స్థానిక పరిశ్రమలను గ్లోబల్ సప్లై చైన్‌తో అనుసంధానించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ఒక ఆర్థిక ప్రగతి కేంద్రంగా (గ్రోత్ ఇంజన్) తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో టీ-హబ్‌లో సోమవారం నిర్వహించిన మెగా ఎఫ్‌టీఏ అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్య సాధనలో ఎగుమతుల పాత్ర కీలకమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండియా వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (ఎఫ్‌టీఏలు) వల్ల అనేక నూతన వాణిజ్య అవకాశాలు తలుపు తడుతున్నాయన్నారు. వీటిని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలోని పరిశ్రమలు, ఎగుమతిదారులు ముఖ్యంగా ఎంఎసఎంఈలకు మార్గనిర్దేశనం చేస్తామని ఆయన చెప్పారు. ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఉత్పత్తులు ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలన్నింటికీ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాల వారీగా లభించే ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి, వాటి తయారీ, ప్రాసెసింగ్, ఎగుమతులను ప్రోత్సహిస్తామన్నారు. దేశీయ ఆహార అవసరాలు తీరిన తర్వాత మిగిలే వ్యవసాయ ఉత్పత్తులు వృథా కాకుండా ఎగుమతులకు మళ్లించాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఎఫ్‌టీఏ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు, పరిశ్రమలకు కేంద్రం మార్గనిర్దేశం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, వివిధ జిల్లాల కలెక్టర్లు మను చౌదరి, ప్రియాంక ఆలా, కుష్బూ గుప్తా, అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





