– కేర్ హాస్పిటల్స్లో సేఫ్టీ అవేర్నెస్ ఫెయిర్–2026 నిర్వహణ
హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : రోగి ఆరోగ్య పరిస్థితిలో వచ్చే ప్రమాద సంకేతాలను సకాలంలో గుర్తించకపోవడం, అత్యవసర వైద్యసేవల్లో జాప్యం, చేతుల పరిశుభ్రతను పాటించకపోవడం వంటి కారణాలు రోగుల భద్రతకు ముప్పుగా మారవచ్చని వైద్య నిపుణులు హెచ్చరించారు. రోగుల భద్రతపై ఉద్యోగుల్లో అవగాహన పెంచేందుకు కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని కార్పొరేట్ కార్యాలయంలో ‘సేఫ్టీ అవేర్నెస్ ఫెయిర్–2026’ నిర్వహించారు. కార్పొరేట్ ఆఫీస్ క్లస్టర్–2 క్వాలిటీ అండ్ పేషెంట్ సేఫ్టీ విభాగం, కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ క్వాలిటీ టీమ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ ఇండియా–2 సీఈవో డాక్టర్ పవన్ కుమార్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ శలభ్ డాంగ్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విన్సీ అశోక్ త్రిభువన్, ఇండియా–2 క్వాలిటీ అండ్ పేషెంట్ సేఫ్టీ హెడ్ రాజీవ్ చౌరేతో పాటు పలువురు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా చేతుల పరిశుభ్రత, రోగి ఆరోగ్య పరిస్థితిలో ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించడం, గుండె ఆగిపోయినప్పుడు నిర్వహించే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై అవగాహన కల్పించారు. ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు.రోగి ఆరోగ్య పరిస్థితి విషమించే ముందు కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు వివరించారు. శ్వాస తీసుకోవడంలో అకస్మాత్తుగా ఇబ్బంది, స్పృహలో మార్పులు, గుండె స్పందన లేదా రక్తపోటులో అసాధారణ హెచ్చుతగ్గులు, రక్తంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వీటిని వెంటనే వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే అవసరమైన చికిత్సను సకాలంలో అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైవ్స్ అనే సందేశంతో చేతులను సరైన పద్ధతిలో శుభ్రం చేసుకోవడంపై ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. హాస్పిటల్స్ ల్లో వ్యాపించే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో చేతుల పరిశుభ్రత కీలకమని వివరించారు. అలాగే గుండె ఆగిపోయిన పరిస్థితిని ఎలా గుర్తించాలి, అత్యవసర వైద్య సహాయాన్ని ఎలా కోరాలి, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది వచ్చే వరకు ఎలా స్పందించాలనే అంశాలపై సీపీఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ ఇండియా–2 సీఈవో డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, ‘‘వైద్యరంగంలో రోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆధునిక వైద్య సాంకేతికత, నిపుణులైన వైద్యులు ఎంత ముఖ్యమో, నివారించగల ప్రమాదాలను ముందుగానే అరికట్టడం కూడా అంతే ముఖ్యం. అవగాహన, సమన్వయం, సకాలంలో స్పందించడం ద్వారానే భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచవచ్చు. రోగులకు నేరుగా సేవలందించే వారితో పాటు పరిపాలన, ఇతర సహాయక విభాగాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగికీ రోగుల భద్రతలో బాధ్యత ఉంది’’ అని తెలిపారు. ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ ఇండియా–2 క్వాలిటీ అండ్ పేషెంట్ సేఫ్టీ హెడ్ రాజీవ్ చౌరే మాట్లాడుతూ, ‘రోగి ఆరోగ్య పరిస్థితిలో వచ్చే హెచ్చరిక సంకేతాలను గుర్తించకపోవడం, సమాచారాన్ని సకాలంలో అందించకపోవడం, చేతుల పరిశుభ్రతలో నిర్లక్ష్యం వంటి చిన్న పొరపాట్లు కూడా రోగుల భద్రతపై ప్రభావం చూపవచ్చు. ప్రమాదాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్య ప్రతి విభాగంలోని ఉద్యోగులు భద్రతా నియమాలను పాటించడంతో పాటు సమస్య ఎదురైనప్పుడు వెంటనే స్పందించేలా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం’’ అని వివరించారు. రోగుల భద్రతలో వైద్యేతర విభాగాల ఉద్యోగుల పాత్ర కూడా ముఖ్యమన్నారు. వివిధ కార్పొరేట్ విభాగాల ఉద్యోగులు క్వాలిటీ, పేషెంట్ సేఫ్టీ నిపుణులతో చర్చించి ఇన్ఫెక్షన్ల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందన, సమర్థవంతమైన సమాచార మార్పిడిపై అవగాహన పొందారు.‘వన్ టీమ్.. వన్ మిషన్.. సేఫర్ కేర్’ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘మీరు కార్పొరేట్ విభాగంలో పనిచేస్తున్నా మీ పాత్ర రోగుల భద్రతపై ప్రభావం చూపుతుంది’ అనే సందేశాన్ని అందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





