స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ వింగ్ మెరుపు దాడులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 :హైదరాబాద్ క్యూర్ పరిధిలోని పలు స్వీట్ షాపుల్లో తెలంగాణ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు పలు స్వీట్ షాపులపై ఏకకాలంలో దాడులు చేపట్టి విస్తృతంగా తనిఖీలు చేశారు. తనిఖీల సమయంలో స్వీట్ షాపుల యాజమాన్యాలు అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎఫఎసఎసఏఐ లైసెన్స్ లేకుండానే అనేక షాపులను నడుపుతున్నట్లు తేలింది. కొన్ని షాపుల్లో లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ పునరుద్ధరణ చేసుకోకుండానే విక్రయాలు కొనసాగిస్తున్నారు. గడువు తీరిన స్వీట్లను షాపుల నుంచి తొలగించకుండా యథేచ్ఛగా అమ్మకానికి ఉంచినట్లు అధికారులు కనుగొన్నారు. పాత స్వీట్లను పారవేయకుండా కొత్త స్వీట్ల తయారీలో కలిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు వెల్లడైంది. పురుగులు పట్టిన, ఫంగస్ వచ్చిన పల్లీలు, పాడైపోయిన స్వీట్లను కూడా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని స్వీట్ షాపులను వెంటనే మూసివేయించడమే కాక మరికొన్నింటికి షోకాజ్ నోటీసులు, మెరుగుదల నోటీసులు జారీ చేశారు. గడువు ముగిసి పాడైపోయిన స్వీట్లన్నింటినీ అధికారులు ధ్వంసం చేశారు. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు పూర్తయిన తర్వాత ఉల్లంఘనలకు పాల్పడిన షాపుల వివరాలు, తీసుకున్న చట్టపరమైన చర్యలపై త్వరలోనే పూర్తిస్థాయి వివరాలందిస్తామని టీజీ సేఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు తెలిపారు.

కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్ తయారీ-

72 కిలోల కల్తీ ముడిసరుకు సీజ్

ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తున్న కేంద్రంపై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. మేడ్చల్ పరిధిలోని అత్వెల్లిలో రహస్యంగా ‘ఏ-1’ బ్రాండ్ పేరుతో అల్లం- వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో రాష్ట్ర ఫుడ్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు ఎస్ఓటీ, టీజీసీఏఎఫ్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో వినియోగానికి పనికిరాని 50 కిలోల కుళ్లిన అల్లం, 22 కిలోల బూజు పట్టిన వెల్లుల్లిని స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *