శూన్య హస్తాలు.. శుష్కప్రియాలు

– ఇదీ రేవంత్ నిర్వాకం
– తప్పుచేసి మాపై నిందలా?
– మీరు చేసిన తప్పును సరిదిద్దాం
– మొబిలైజేషన్ అడ్వాన్ల పేరిట కమీషన్లు దండుకున్నదీ మీరే
– కృష్ణాజలాల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తి విఫలం
– కాంగ్రెస్ వైఫల్యంతో 25లక్షల ఎకరాల్లో ఎండిన పంట
– అకాల వర్షం నష్టాలకు ఇంతవరకు సాయం అందలేదు
– మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 16 : నాడు ఏడేళ్లు.. నేడు మూడేళ్లు..  పదేళ్లు తట్టెడు మట్టి ఎత్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మూడేళ్లు అయ్యింది అధికారంలోకి వచ్చి కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టారా? కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారా? కొత్తగా ఒక్క చెరువు తవ్వారా? శూన్య హస్తాలు, శుష్క ప్రియాలు త‌ప్ప‌ మీరు చేసింది గుండు సున్నా అని బిఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ మీద బురద జల్లడం తప్ప మీరు ప్రజలకు చేసింది ఏం లేదు. వేల చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు నిర్మించి, వేల చెరువుల పునరద్ధరణ చేసి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం. కాలయాపన చేసింది మీరు, తప్పు చేసింది మీరు, కానీ దిల్లీలో మాపై నిందలు వేస్తున్నారు. ఇప్పటికైనా అనవసరమైన తప్పుడు మాటలు మాట్లాడటం మాని కనీసం మేం నిర్మించిన ప్రాజెక్టుల చివరి దశ పనులను పూర్తి చేయాలని, వాటి పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉత్తం కుమార్ రెడ్డికి సావాస దోషం ఉన్నట్లు ఉంది. ముఖ్యమంత్రి లాగానే దిల్లీలో అన్ని అబద్దాలే మాట్లాడుతున్నరు. తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు రాజకీయాల కోసం, కమీషన్ల కోసం మార్చినం అంటున్నరు. ఒక అబద్దాన్ని పదేపదే చెబితే అది నిజం అన్న రీతిలో కాంగ్రెస్ వ్యవహారం శైలి ఉంది. అసెంబ్లీ సాక్షిగా అన్ని ఆధారాలతో మీకు సమాధానం చెప్పి మీ నోళ్లు మూయించాం. తమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, సిడబ్లుసి రాసిన లేఖలను చూపించాం. నీళ్లు లేనిచోట మీరు ప్రాజెక్టులు కడితే నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చినం. మీరు చేసిన తప్పును సరిదిద్దాం, మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసింది కేసీఆర్. మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట పనులు చేయకుండా బిల్లులు ఎత్తి కమీషన్లు కొట్టారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మొబిలైజేషన్ అడ్వానులు రద్దు చేసి పారదర్శకమైన పద్దతిలో పనులు జరిపించాం. సిగ్గులేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఏడు సంవత్సరాలు కేంద్రంలో, మన రాష్ట్రంలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్నా అనుమతులు తేకుండా కాలయాపన చేసింది మీరు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ ఆ రోజు లేఖ రాసిండు. మీరు పెట్టే ఖర్చు వృధా అవుతుందని తప్పు పట్టారు. కానీ మీరు బిఆర్ఎస్ తప్పు చేసినట్లు ఢిల్లీలో మాట్లాడుతున్నారు.
ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే, కరువును ఎదురుకునే శక్తి ప్రభుత్వానికి ఉండేది.దేవాదుల, కాళేశ్వరం, సీతమ్మ సాగర్, సమ్మక్క బ్యారేజీ, పాలమురు ప్రాజెక్టులకు కరువును ఎదుర్కొనే శక్తి ఉంది.మూడేళ్లలో కృష్ణా జలాల్లో అతి తక్కువ నీటిని ఎత్తింది మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే.కృష్ణా జలాల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.చేతగాని తనాన్ని దాచుకునేందుకు మాపై బురద చల్లుతున్నారు.ప్రజలు నవ్వుతున్నారు కాంగ్రెస్ వ్యవహారం చూసి.కాంగ్రెస్ హయాంలో వానాకాలంలో 25 లక్షల ఎకరాల్లో పంట ఎండింది. దీనికి కాంగ్రెస్ ఫెయిల్యూర్ కారణం.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 19న సిద్దిపేటకు వస్తున్నారు. ప్రజల పక్షాన బహిరంగ లేఖ విడుదల చేస్తున్నాం.సీఎం వస్తున్నారంటే మేలు జరుగుతుంది అనుకుంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనుకుంటారు.కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో వస్తే, ఒకసారి మల్లన్న సాగర్, ఒకసారి మెడికల్ కాలేజీ, మరొకసారి జిల్లా కలెక్టరేట్లు ప్రారంభించారు.కానీ రేవంత్ వస్తే ఒక్క మేలు కూడా జరగలేదు. ఇప్పటికే రెండు సార్లు వచ్చారు.మే2, 2024నాడు మొదటి సారి వచ్చినప్పుడు అంబేద్కర్ చౌరస్తా వద్ద కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు.ఇప్పటికీ మూడు పంద్రాగస్టులు పోయాయి కానీ ఇప్పటికీ రైతు రుణమాఫీ కాని పరిస్థితి.రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, గ్రామంలోనే రుణ మాఫీ కాలేదు.ఒక్క నా సిద్దిపేట నియోజవర్గంలోనే 20,514 మందికి రుణమాఫీ అయితే, 22,819 మందికి రుణమాఫీ కాలేదు.అంటే అయ్యింది తక్కువ, రుణమాఫీ కానిది ఎక్కువ.రేవంత్ మాటలు నమ్మి రెండు లక్షల పైన రుణాలు ఉన్నవాళ్లు అప్పులు చేసి బ్యాంకులకు పోయి కట్టారు. వాళ్లంతా మోసపోయారు.దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పనందుకు ఈరోజు రాష్ట్రానికి అరిష్టం కలిగింది.రేవంత్ పాపం వల్లనే రాష్ట్రానికి కరువు వచ్చింది.నువ్వు మల్లా వస్తున్నవు నీకు స్వాగతం పలుకుతున్నాం. కానీ ఒక్క షరతు.. రుణమాఫీ విషయంలో ఒట్టు వేసి చెప్పిన మాటను నిలుపుకో. అందరికి రుణమాఫీ చేసి సిద్దిపేటకు రండి. నేనే నీకు బొకే ఇస్తా.ఇచ్చిన మాట నిలుపుకోని నువ్వేం ముఖ్యమంత్రివి. కుర్చీ పరువు ఎందుకు తీస్తున్నవు.రెండో సారి కేసీఆర్ నిర్మించిన ఆయిల్ ఫాం ఫ్యాక్టీరికి రిబ్బన్ కట్ చేసేందుకు మార్చి 22న సిద్దిపేటకు వచ్చిండు.ఆరోజు మీటింగ్ లో 45 రోజుల్లో 9వేల కోట్ల రైతు భరోసా నిధులు వేస్తాం అని రాష్ట్ర రైతాంగానికి హామీ ఇచ్చిండు.230 రోజులు గడించింది ఈ రోజుకు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఎప్పటిలోగా అమలు చేస్తవు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.యాసంగి రైతు బంధు విషయంలో ప్రజలకు ఇచ్చిన హామి నిలబెట్టుకోలేదు.కొంచెం అన్నా చీము నెత్తురు ఉంటే, కనీసం నీకు ప్రజలంటే గౌరవం ఉంటే, దేవళ్లు మీద భక్తి ఉంటే.. ఇచ్చిన రైతు బంధు హామీ అమలు చేసి సిద్దిపేటకు రా. నేనే స్వాగతం పలుకుతా.
కేసీఆర్ సిద్దిపేట వెటర్నరీ కాలేజీ మంజూరు చేస్తే దాన్ని కొడంగల్ తీసుకుపోయావు.పనులు కూడా జరుగుతున్న కాలేజీని మీ ప్రభుత్వం రాగానే ఫిబ్రవరి 29, 2024 నాడు సిద్దిపేట వెటర్నరీ కాలేజీని రద్దు చేసారు.మా కాలేజీని అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రద్దు చేసారు.
ఏం ముఖం పెట్టుకొని సిద్దిపేట ప్రజలకు సమాధానం చెబుతావు. ఈ ప్రాంత ప్రజల మీద ప్రేముంటే వెంటనే నువ్వు రద్దు చేసిన వెటర్నరీ కాలేజీని పునరద్దురించాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.సిద్దిపేట ప్రాంతానికి మంజూరైన ఔటర్ రింగు రోడ్డు, బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ, శిల్పారామం, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్, స్పోర్ట్స్ స్టేడియం, ఆడిటోరియం ఇలా..వివిధ పనులకు చెందిన రూ. 1070 కోట్ల పనులను రద్దు చేసారు. నిధులు నిలిపి వేసారు.కొత్త ప్రభుత్వం ఆన్ గోయింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు, కొత్త పనులు మొదలు పెట్టి పూర్తి చేయాలి. అంతేగాని ఇలా ఆపడం ఏమిటి? రూ.1070 కోట్ల నిధులు విడుదల చేయాలని, పెండింగ్ లో పెట్టిన పనులను యుద్ద ప్రాతిపాదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం.యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల విషయంలో ఎందుకు వివక్ష?87 నియోజకవర్గాలకు ఇచ్చి సిద్దిపేటకు ఎందుకు ఇవ్వలేదు.అంటే సిద్దిపేట ఈ రాష్ట్రంలో లేదా?వివక్ష లేదు అంటూనే స్పష్టంగా వివక్ష చూపుతున్నారు.సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభిస్తే రేవంత్ రాగానే బంద్ పెట్టిండు. పోనీ మల్లా స్టార్ట్ చేసినా అంటడు.మరి సిద్దిపేట పాఠశాలల్లో ఎందుకు ప్రారంభించలేదు. ఇది వివక్ష కాదా?
మా ప్రాంతంలో అకాల వర్షాల వల్ల నష్టం జరిగింది.శ్రీధర్ బాబు, తుమ్మల, పొన్నం వచ్చి పర్యటన చేసి పోయారు.రైతులను ఆదుకుంటాం అని చెప్పి వెళ్లారు కానీ ఇప్పటికీ ఏదీ లేదు.కేసీఆర్ ఎకరాకు పదివేల సాయం అందించే ఆదుకునే వారు.ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, రైతులను ఆదుకోనేలేదు.సిద్దిపేట మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి.అకాల వర్షాలు, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఎలాంటి భరోసా దక్కలేదు.ముఖ్యమంత్రి సహా మంత్రులు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు పరిహారం అందించాలని, మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రిబ్బన్ కట్ చేసి 50 పడకల ఆయుష్ ఆసుపత్రి ప్రారంభించి ఏడాదైనా ఈరోజు వరకు వైద్య సేవలు ప్రారంభం కాలేదు.మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కడుతుంటే రేవంత్ 48 గంటల దీక్ష చేసిండు. పెద్ద పెద్ద మాటలు చెప్పిండు.మల్లన్న సాగర్ విషయంలో 90శాతం నిర్వాసితులకు కేసీఆర్ న్యాయం చేసారు.కోర్టు ఆర్డర్ల వల్ల, స్టేల వల్ల ఆగింది. ఇప్పుడు అవి క్లియర్ అయ్యాయి.అయినా మూడేళ్ల నుంచి ఎందుకు పరిహారం అందించడం లేదు.మల్లన్న సాగర్ నిర్వాసితుల మీద మీ ప్రేమ అంతా కపట ప్రేమనేనా? ఆనాడు మేం ఇచ్చిన దానికంటే ఎంత ఎక్కువ ఇస్తవో ఇవ్వు.కోర్టు ఆర్డర్ వచ్చినా ఎందుకు నిర్వాసితులకు న్యాయం చేయడం లేదు.మల్లన్న సాగర్ నుంచి మూసీలో నీళ్లు పోస్తా అంటున్నావు. మరి నిర్వాసితుల గురించి కూడా ఆలోచించాలి కదా.కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోస్తే సిద్దిపేట జిల్లాకు కరువు లేదు.కావాలనే కట్క ఒత్తక నీళ్లు ఎత్తక లేని కరువు సిద్దిపేటకు రుద్దినవు.మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ కిందనో ఒక్క మూరెడు కాలువ తవ్వినవా?మేం సొంత డబ్బులు పెట్టి తవ్విస్తున్నాం. నీళ్లు అందిస్తున్నాం.కాల్వల తవ్వకాన్ని మూడేళ్లుగా ఆపేసి కక్ష కట్టినట్లు వ్యహరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.మిర్దొడ్డి మండలానికి ఇర్కోడ్ లిఫ్ట్ పూర్తి చేస్తే ద్వారా పుష్కలంగా నీళ్లు వస్తయి. 95శాతం పని అయినా 5శాతం పని మూడేళ్లుగా చేయడం లేదు. మీ నిర్లక్ష్యం వల్ల ఇర్కోడ్ లిఫ్ట్ పథకం ఆగింది.గౌరవెల్లి రిజర్వాయర్ లో ఒక టీఎంసీ నీళ్లు నింపినం. కానీ కాల్వలు తవ్వకుండా, మరమ్మతులు చేయకుండా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. హుస్నాబాద్ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతున్నది.మల్లన్న సాగర్ నుంచి తపాస్ పల్లికి నీళ్లు తీసుకుపోవడానికి కేసీఆర్ పనులు ప్రారంభించారు. 50శాతం పనులు పూర్తయ్యాయి. అది అయితే చేర్యాల ప్రాంతం సస్యశ్యామలం అవుతుందే దాన్ని నిలిపివేసావు.
కొండపోచమ్మ కాల్వలు నిపివేసావు. జిల్లా మీద వివక్షతో ఈ పనులు నిలిపి వేసావు. పగబట్టి తీరని అన్యాయం చేసినవు.వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తవు అని బాండ్ పేపర్లు పంచినవు.4వేల పింఛన్లు ఎప్పుడు ఇస్తవు రేవంత్ రెడ్డి.ఒక్కో అవ్వా తాతకు 72వేల బాకీ పడ్డవు. బాకీతో సహా నాలుగు వేల పించన్ ఇవ్వాలి.ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తా అన్నవు. 90వేల బాకీ పైసలు ఇవ్వాలి. వెంటనే అమలు చేయాలి.ఫీజు రియింబర్స్ మెంట్ 20 లక్షల మందితో ఆడుకుంటున్నావు.కేసీఆర్ గారు 19,500 వేల కోట్లు ఫీజు రియంబర్స్ మెంట్ బిఆర్ఎస్ ప్రబుత్వం ఇచ్చింది.నువ్వు 600 కోట్లు కూడా ఇవ్వలేదు.ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. సర్టిఫికేట్లు రాక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు.ఆ ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.వెయ్యి పడకల ఆసుపత్రి పనులు చేయకుండా మూలన పడేసారు.ఈ ప్రాంత ప్రజలను వైద్యానికి దూరం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.160 కోట్లతో సిద్దిపేట రింగ్ రోడ్డు మంజూరు చేసుకొని 90శాతం పనులు పూర్తయింది. ఈరోజు ఆ పనులు కూడా పూర్తి చేయడం లేదు. శిల్పారామం పనులు పూర్తి చేయ లేదు. నర్సింగ్ కాలేజీ బిల్డింగ్ ఆగిపోయింది. చిన్న కోడూరు రోడ్లు ఎక్కడ చూసినా గుంతలే. రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్టు ఆగిపోయింది. అనేక పోలీసు స్టేషన్ బిల్డింగ్ లు ఆగిపోయాయి. మల్టీ పర్పస్ ఆడిటోరియం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌ పనులు.. ఇట్ల అనేక పనులు ఆగిపోయాయి. సిద్దిపేట ప్రజలను దారుణంగా రెండుసార్లు మోసం చేసావు. మొదటిసారి రుణ మాఫీ అని మాట తప్పావు. రెండోసారి రైతు బంధు నిధులు అని మాట తప్పావు.. తా‎ము ప్రత్యేక ప్రాధాన్యత కోెరుకోవడం లేదు, ఇప్పటికే ప్రారంభమైన పనులను పూర్తి స్థాయిలో కొనసాగించండి అని అడుగుతున్నాం. సిద్దిపేట అభివృద్దికి అడ్డుగా నిలవకు..ప్రజలను మోసం చేయకు.. ముఖ్యమంత్రి హోదాలో సిద్దిపేట సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేసి సీఎం కుర్చీ పరువు కాపాడు అని హిత‌వు ప‌లికారు. సిద్దిపేట ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటం ఆడొద్దని, మరోసారి మోసం చేయొద్దని, నిలిపివేసిన పనులను కొనసాగించాలని, నిధులు విడుదల చేయాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *