– పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం
– రాజ్యసభలో రేణుకాచౌదరి ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూదిల్లీ, ఆగస్ట్ 10 : కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపింది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పింది. ఆ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని తేల్చిచెప్పింది. ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్ అప్రైజల్‌ను ప్రస్తుతం చేపట్టలేమని.. కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర అంశాలు ట్రెబ్యునల్ పరిధిలో ఉందని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో రావాలంటూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ డీపీఆర్‌ను కేంద్రం తిరిగిన వెనక్కి పంపింది. ప్రాజెక్టుకు కేంద్ర సాయం విషయంలోనూ తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి రాజ్యసభలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ జాతీయ హోదా గురించి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 పరిధిలో అంతర్రాష్ట్ర అంశాలు ఉండటంతో టెక్నో-ఎకనామిక్ అప్రైజల్ సాధ్యం కాదని, సమగ్ర ప్రణాళికతో డీపీఆర్‌ను మళ్లీ సమర్పించాలని సూచించారు. ప్రాజెక్టుకు సాయం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. అంతేకాకుండా, ప్రాజెక్టుకు కేంద్ర నిధుల సాయం అందించే విషయంలోనూ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. జాతీయ ప్రాజెక్టు హోదా అనేది ప్రధానంగా జాతీయ ప్రాధాన్యం, అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల వివాదాలు లేకపోవడం , గణనీయమైన సాగునీటి సామర్థ్యం ఆధారంగా నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారమే ఇస్తామని కేంద్రం పునరుద్ఘాటించింది. కృష్ణా జలాలపై క్లియరెన్సులు, ట్రిబ్యునల్ పరిధిలోని అంశాలు తేలితే తప్ప ఈ ప్రాజెక్టు హోదాపై తదుపరి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు