– ఎల్‌నినోపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
– ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి
ఏదులాపురం/హైదరాబాద్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ది సర్వోత్తమ్ రెడ్డిని మొదటి ప్రాధాన్యతా ఓటుతో ఆధిక్యతతో గెలిపించేందుకు కొత్త ఓటర్లను ఉద్యమ స్పూర్తితో నమోదు చేయించాలని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీలోని నాయుడుపేట జంక్షన్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటైన పాలేరు నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రైతులు మంచి విత్తనాలు నాటితే మంచి దిగుబడి వచ్చినట్లే శాసనమండలికి మంచి అభ్యర్దిని పంపితే మంచి ఫలితాలు ఉంటాయని గుర్తు చేశారు. ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని గుర్తు చేస్తూ మరో ఎనిమిది రోజల వ్యవధిని గుర్తుంచుకుని మీ కుటుంబం, గ్రామం, మిత్రవర్గంలోని గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వంలో లబ్దిపొందిన వారిని గుర్తించి ఓటర్లుగా చేర్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఇటీవల ‘సర’ ఉద్యమం గొప్పగా నిర్వహించినట్లే ఇప్పడు ఈ ఓటర్ల చేర్పించే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇప్పటికే ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంటూ ఈ మూడు జిల్లాలు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నాయని గుర్తు చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించా మన్నారు. సర్వోత్తమ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. దిల్లీలో 1న జరిగే ధర్నాకు లక్షలాదిగా తరలిరావాలని ఆయన కోరారు.
ఎల్‌నినోపై ప్రతిపక్షాల దుష్ప్రచారం
ప్రపంచంలో వంద దేశాలకుపైగా ఎల్‌నినో ప్రభావంతో విపత్కర పరిస్దితులను ఎదుర్కొంటుండగా రాష్ట్రంలో బీఆరఎస్, బీజేపీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ప్రతిపక్షాలు చెప్పే అసత్యాలను ఖండించాలన్నారు. ప్రకృతి విపత్తులను సైతం రాజకీయ లబ్దికి వాడుకోవడానికి ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని ఉపేక్షించవద్దని, ప్రతి ఒక్కరూ వాస్తవాలను ప్రజలకు తెలపాలని కోరారు. ఎల్‌నినోపై ప్రజలను కార్యకర్తలు జాగృతం చేయాలన్నారు. సమావేశానికి కాంగ్రెస్ నేత స్వర్ణకుమారి అధ్యక్షత వహించగా అభ్యర్ధి రామిరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ, పార్టీ నేతలు నాగేశ్వరరావు, గోపాల్ రెడ్డి, ఏదులాపురం చైర్పర్సన్ అనిత, కృష్ణారెడ్డి, నరేష్‌రెడ్డి, గోపన్న, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





