– పరకాలలో యథేచ్ఛగా విక్రయాలు
– నిద్రమత్తులో వ్యవసాయ శాఖ
– నానో యూరియా, బయో మందుల లింకుతో దోపిడీ
హనుమకొండ, అక్టోబర్, ప్రజాతంత్ర 26 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన గడ్డి మందులను పరకాలలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు కొందరు వ్యాపారులు పరకాల మండలంలో సుమారు 100 ఎరువులు పురు గు మందుల షాపులు ఉన్నాయి. ఇందులో చాలా దుకాణాల్లో రూ.270లకు అమ్మవలసిన యూరియా బస్తా రూ.300 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారని రైతులు చెబు తున్నారు. కాంప్లెక్స్ యూరియా బస్తాలతోపాటు నానో యూరియాను అవసరంలేని బయో మందులను ముడిపెట్టి రైతులకు అమ్ముతున్నప్పటికీ అడ్డుకోవాల్సిన అధికారులు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేతల అండదండలు ఉన్నవారే ఎరువులు, పురుగు మందుల దుకాణాలు నిర్వహిస్తుండడంతో వారి అమ్మకాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. అధిక ధరలు, నిషేధిత ఎరువుల విక్రయాలు జరుగుతున్నా మండల వ్యవసాయ అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని నెలల క్రితం పరకాలలో ఓ కీలక నేతకు చెందిన ఎరువుల దుకాణంలో పరకాల ఆర్డిఓ వెంకన్న టాస్క్ ఫోర్స్, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి రెండు దుకాణాల్లో ఎరువులు విక్రయిచొద్దని ఆదేశించారు. కానీ కొన్ని రోజు తర్వాత మళ్లీ యథాస్థితికి వచ్చింది. ఎరువులు పురుగు మందులతోపాటు ఆగ్రోస్ ఏజెన్సీలు సహకార సంస్థల ద్వారా కాంప్లెక్స్ యూరియాను రైతులకు అందజేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ధరలకు కాకుండా అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఏడేళ్లుగా ఒకే చోట ఏవో
పరకాల వ్యవసాయ శాఖ అధికారి గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తుండటంతో వ్యాపారులతో ఆయనకు సత్సంబంధాలు ఏర్పడ్డాయని రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులు ఎరువులు పనిచేయలేదని ఆరోపణలు వచ్చినప్పుడు వ్యవసాయ శాఖ అధికారి వ్యాపారులకు మద్దతిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. గతంలో పరకాలలో మిర్చి విత్తనాలు నాసిరకమని రైతులు ఆందోళన చేపట్టినప్పుడు వ్య వసాయ అధికారి రైతుల పక్షాన నిలవకుండా వ్యాపారులతో మాట్లాడి ప్రలోభాలకు గురిచేసి కేసును పక్కదారి పట్టించారని రైతులు గుర్తు చేస్తున్నారు. విచారణకు వచ్చిన జిల్లా అధికారులను సైతం మేనేజ్ చేసి నాసిరకం విత్తనాలను నాణ్యమైనవిగా ధ్రువీకరించి భారీగా లబ్ది పొందారని ఆరోపిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





