– హౌస్ అరెస్టును ఆక్షేపించిన కప్పాటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజా ప్రభుత్వం కాలయాపన చేయడం సమంజసం కాదని తెలంగాణ ఉద్యమకారుడు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి అన్నారు. ఉద్యమకారుల సంఘాల పిలుపు మేరకు తలపెట్టిన ముఖ్యమంత్రి నివాసం ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కందుకూరు పోలీసులు ఆయనను బాచుపల్లిలో సోమవారం హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైన ఉద్యమకారులను అడ్డుకోవడానికి, ముందస్తు అరెస్టులు చేయడానికి చూపిస్తున్న శ్రద్ధ వారికి ఇచ్చిన హామీల అమలులో చూపాలని పాండురంగారెడ్డి హితవు పలికారు. ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం సాకారమైందని గుర్తు చేశారు. అయితే రాష్ట్రం సిద్ధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన గత ఉద్యమ పార్టీ పాలనలో ఉద్యమకారులకు కనీస గౌరవం దక్కలేదని, తీరని అన్యాయంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని కప్పాటి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రజా ప్రభుత్వంలోనైనా తమకు సముచిత గౌరవం, న్యాయం దక్కుతుందని నమ్మిన ఉద్యమకారులకు నేటికీ ఎదురుచూపులే మిగలడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ద్వారా అర్హులైన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు. కమిటీ నివేదికకు అనుగుణంగా హామీని నెరవేర్చడం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





