– చొరబాటుదారుల తరపున రాహుల్ వకాల్తా
– రాష్ట్రంలో కాంగ్రెస్ కౌంట్ డౌన్ మొదలైంది
– బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర విమర్శలు
కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 23 : కాంగ్రెస్, ఇండి కూటమి, రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (‘సర్’) ప్రక్రియను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. కరీంనగర్ గడ్డపై సోమవారం నిర్వహించిన మహా పాదయాత్రలో పాల్గొని అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని, కానీ ప్రజల మద్దతు, అసలైన ఓట్లు బీజేపీ పక్షాన ఉన్నాయని స్పష్టం చేశారు. ఓట్ల చోరీ ఆరోపణల్లోని లెక్కలను ప్రస్తావిస్తూ మూడు కోట్ల మంది మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండాలా, వేరే ప్రాంతాలకు బదిలీ అయిన ఆరు కోట్లకు పైగా ఓటర్లకు రెండుచోట్ల ఓటు హక్కు ఉండాలా అని ప్రశ్నించారు. 2002 లేదా 2003 ఓటర్ల జాబితాలో ఆచూకీ లేని మూడు కోట్ల మంది అక్రమ చొరబాటుదారుల ఓట్ల కోసమే విపక్షాలు వకాల్తా పుచ్చుకుంటున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం ప్రతులను పట్టుకుని తిరిగే వారి కంటే తమ మనసులో, హృదయంలో రాజ్యాంగానికి స్థానం ఉందని, రాజ్యాంగ సంస్థలను తాము గౌరవిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రాంతాల్లో రామ్‌లీలా మైదానానికి పదిరెట్ల జనాన్ని బీజేపీ సమీకరించి సత్తా చాటిందని చెప్పారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై ఘాటు వ్యాఖ్యలు
తమ కుటుంబం, కుర్చీ కాపాడుకోవడానికి దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరమని నితిన్ నబీన్ విమర్శించారు. రాహుల్ గాంధీ దేశంలో ఉన్నా, విదేశాలకు వెళ్లినా దేశాన్ని, దేశ ప్రజలను అవమానిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 36 నెలల పాలన పూర్తికాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 82 సార్లకు పైగా దిల్లీకి వెళ్లి అధిష్ఠానానికి మోకరిల్లారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, యువతకు కాకుండా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ ఖాతాలకు ‘ఏటీఎం’లా పనిచేస్తున్నారని విమర్శించారు. యువత, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన తీర్పు చెబుతారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు.
మోదీ నాయకత్వం, కరీంనగర్ జనస్పందనపై హర్షం
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో దేశంలో నిరాశాజనక వాతావరణం ఉండేదని, 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశంలో ఆశలు చిగురించాయని నితిన్ నబీన్ అన్నారు. గతంలో బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్ నేడు మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, పేదల కోసం పంపే రూపాయికి రూపాయి లబ్ధిదారులకు అందుతోందని తెలిపారు. సరిహద్దు గ్రామాలను మొదటి గ్రామాలుగా అభివృద్ధి చేస్తున్నారని, నషా ముక్త్ భారత్ లక్ష్యంతో డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నారని, 2028, 2029 ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని ప్రతి ఇంటికీ అండగా నిలిచిన బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కార్యకర్తల కృషి వల్లే ఇంతటి భారీ జనసందోహం కనిపించిందని అభినందించారు.
కరీంనగర్ గడ్డపై జై శ్రీరాం గర్జన
ఇప్పటివరకు నిర్వహించిన పాదయాత్రల్లో ఇదే టాప్.. నితిన్ ఖుషీ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించిన మహా పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యిందని పార్టీ శ్రేణులు చెబుతున్నరు. మహా పాదయాత్ర షెడ్యూల్ మూడు రోజుల ముందే ఖరారైనప్పటికీ తక్కువ సమయంలో ఊహించని విధంగా జనం, కార్యకర్తలు తరలి రావడంతో బీజేపీ శ్రేణులు, పోలీస్, రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. కరీంనగర్ గాంధీ చౌక్ నుండి వైశ్య భవన్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, శాస్త్రీ రోడ్ మీదుగా కమాన్ సెంటర్ దాకా జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా ఆ ప్రాంతమంతా జన సంద్రమైంది. జన ప్రభంజాన్ని చూసిన నితిన్ నిబిన్ వారితో కలిసి అడుగులో అడుగు వేస్తూ గంటా 45 నిమిషాలు దాదాపు 2 కి.మీల మేరకు మహా పాదయాత్ర చేశారు. కమాన్ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఎగరేసి మహా పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యిందంటూ ముగించారు. సర్’ కు మద్దతుగా దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో మహా పాదయాత్రలు నిర్వహించాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్ సహా 13 చోట్ల మహా పాదయాత్రలు నిర్వహించింది. అయితే ఇప్పటి వరకు జరిగిన అన్ని మహా పాదయాత్రల్లోకెల్లా కరీంనగర్ లో నిర్వహించిన మహా పాదయాత్ర టాప్ లో నిలిచిందని బీజేపీ నాయకులు, పరిశీలకులు చెబుతున్నారు. మహా పాదయాత్రలో ప్రజా స్పందన, కార్యకర్తల జోష్ ను చూసిన నితిన్ నబిన్ సైతం ఆనందం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ను ఆలింగనం చేసుకోవడం గమనార్హం. ఇగ కరీంనగర్ గడ్డ కాషాయ అడ్డా అని కాషాయ సైన్యం మరోసారి నిరూపించింది. మహా పాదయాత్రకు స్వచ్ఛందంగా తండోపతండాలుగా కాషాయ సైనికులు తరలి వచ్చి జై శ్రీరాం.. జై శ్రీరాం అంటూ గర్జించారు. జై మోదీ, జైజై నితిన్, జైజై బండి సంజయ్, జైజై రామచంద్రరావు అంటూ నినాదాలతో హోరెత్తించారు. మహా పాదయాత్రకు తరలివచ్చిన జనం, కాషాయ కార్యకర్తలతో కరీంనగర్ జన సంద్రమైంది. కరీంనగర్ చరిత్రలో ఎన్నోసార్లు రాజకీయ పార్టీలు పాదయాత్ర చేసిన సందర్భాలున్నాయి. కానీ బండి సంజయ్ చేపట్టిన మహా పాదయాత్రహైలైట్ గా నిలిచింది గాంధీ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు జన సందోహం బారులు తీరడం కన్పించింది. వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు నితిన్ నబిన్ వెంట నడుస్తూ జోష్ నింపారు. ఇక నితిన్ నబిన్ పాదయాత్ర చేస్తున్నంత సేపు కార్యకర్తలు, బీజేపీ అభిమానులు ఆయనపై పూల వర్షం కురిపించారు. ఇండ్లు, భవనాల, వ్యాపార సముదాయాలపైకి ఎక్కి నితిన్ నబిన్ పాదయాత్రను జనం వీక్షించడం గమనార్హం. డప్పు చప్పుళ్లు, అట పాటలతోనూ యువత మహా పాదయాత్రలో సర్ కు మద్దతుగా నినాదాలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





